వెంకన్న కొత్త డిమాండ్.. ఇద్దరినీ మార్చాల్సిందే
తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు ఆగేట్లు లేదు. పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొత్త డిమాండ్ పెట్టారు.
తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు ఆగేట్లు లేదు. పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొత్త డిమాండ్ పెట్టారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని మార్చాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని పీసీీసీ చీఫ్ గా కొనసాగిస్తే పార్టీ చచ్చిపోతుందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిని పీసీీసీ చీఫ్ గా తప్పించాలని, అలాగే మాణికం ఠాకూర్ ను ఇన్ ఛార్జి పదవి నుంచి తొలగించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ కోమటరెడ్డి వెంకటరెడ్డి కొత్త డిమాండ్ ఇప్పుడు పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసేలా ఉంది.
సమావేశానికి దూరంగా...
నిన్న సాయంత్రం జరిగిన ఏఐసీసీ సమావేశానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరంగా ఉన్నారు. ఉదయం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న కోమటిరెడ్డి సాయంత్రానికి హైదరాబాద్ చేరుకున్నారు. తాను ఏఐసీసీ సమావేశానికి ఎందుకు హాజరు కాలేకపోతున్నదీ సోనియా గాంధీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. ఆయన లేఖలో వివరణ ఇచ్చుకున్నారు. తనను పార్టీలో ఎలా అవమానించింది ఆయన లేఖలో ప్రస్తావించారు.
రేవంత్ టార్గెట్ గా...
తనను, తన కుటుంబాన్ని దూషించడంతో పాటు, చుండూరు లో జరిగిన సభ విషయం తనకు తెలియపర్చకపోవడం, తనకు తెలియకుండానే నల్లగొండ జిల్లాలో చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా చుండూరు సభలో తనను అవమానించడమే కాకుండా, సాక్షాత్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనను హోంగార్డుగా పేర్కొనడాన్ని కూడా ఆయన పేర్కొన్నారు.
కమల్‌నాథ్ వంటి సీనియర్లను...
మాణికం ఠాకూర్ స్థానంలో కమల్‌నాధ్ వంటి సీీనియర్ నేతలను నియమించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్, మాణికం ఠాకూర్ లు ఈ పదవుల్లో కొనసాగితే కాంగ్రెస్ కోలుకోలేదని కూడా తెలిపారు. అందరి నేతల అభిప్రాయాలను తీసుకుని ఇద్దరినీ మారిస్తేనే పార్టీకి విజయావకాశాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొత్త నినాదం పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.