తెలంగాణలో ఓటరు నాడిని ఎగ్జిట్ పోల్స్ కూడా సరిగ్గా పసిగట్టినట్లు కనిపించడం లేదు. కొన్ని ఛానళ్లు టీఆర్ఎస్ కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అంచనా వేయగా... మరికొన్ని మాత్రం కాంగ్రెస్ కి కూడా అవకాశం ఉన్నట్లు, హంగ్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తేల్చాయి. ఈ సర్వేలు కాంగ్రెస్ కి కొంత ఊరట కలిగించేలా ఉన్నాయి.
పోటాపోటీ తప్పదని చెప్పిన న్యూస్ నేషన్
న్యూస్ నేషన్ టీవీ సర్వే ప్రకారం టీఆర్ఎస్ కి 53-57 స్థానాలు, కాంగ్రెస్ కూటమికి 51 -55 స్థానాలు, బీజేపీకి 1-5 స్థానాలు, ఇతరులకు 4-12 స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లు తెలింది. రాష్ట్రంలో 60 స్థానాలు దక్కించుకున్న పార్టీ అధికారం చేపడుతుంది. ఈ సర్వే ప్రకారం టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు ఎంఐఎంపై ఆధారనపడాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది.
రెండు పార్టీలకు సమాన స్థానాలు
రిపబ్లిక్ టీవీ - సీ ఓటర్ సర్వే ప్రకారం టీఆర్ఎస్, ప్రజాకూటమికి ఇంచుమించు సమాన స్థానాలు వస్తాయని తేలింది. టీఆర్ఎస్ కి 48-60 స్థానాలు, ప్రజాకూటమికి 47-59 స్థానాలు, బీజేపీకి 5 స్థానాలు, ఇతరులకు 1-13 స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లు తేలింది. ఈ సర్వే ప్రకారం రెండు పార్టీలూ అధికారానికి దగ్గరలో ఉన్నాయని తేలింది.