టీడీపీ డోర్స్ క్లోజ్ అయిపోయినట్లేనా?
వరదాపురం సూరికి ధర్మవరం నియోజకవర్గంలో మంచి పట్టుంది. టీడీపీ వేదికగా రాజకీయంగా ఆయన కుటుంబం ఎదిగింది.
రాజకీయాలలో ఎప్పుడు అవతలవారికి అవకాశం ఇవ్వకూడదు. అలా అవకాశం ఇచ్చి పాలిటిక్స్ లో కన్పించకుండా పోయిన వారు అనేక మంది మన కళ్ల ముందే కనపడతారు. తాత్కాలిక ఉపశమనం కోసం ఒక నిర్ణయం తీసుకుంటే భవిష్యత్ లో శాశ్వతంగా అవకాశాలు కోల్పోయిన వారు కూడా అనేక మంది ఉన్నారు. వీరిలో ఇప్పుడు మనకు కన్పించేది వరదాపురం సూరి అలియాస్ గోనుగుంట్ల సూర్యనారాయణ.
మంచి పట్టున్నా...
వరదాపురం సూరికి ధర్మవరం నియోజకవర్గంలో మంచి పట్టుంది. టీడీపీ వేదికగా రాజకీయంగా ఆయన కుటుంబం ఎదిగింది. 2004లోనే గోనుగుంట్ల జయలక్ష్మమ్మ టీడీపీ నుంచి ధర్మవరంలో గెలిచారు. 2014 ఎన్నికల్లో వరదాపురం సూరి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ధర్మవరం పై తన పట్టును మరింత పెంచుకోగలిగారు. కానీ 2019 ఎన్నికల్లో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పై కేవలం పది వేల ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు.
పార్టీని వీడి...
పోనీ ... పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారా? అంటే అదీ లేదు. ఆయన తన వ్యాపారాలపై వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తుందని, తనపై అక్రమ కేసులు బనాయిస్తుందని భయపడి ఆయన పరుగెత్తు కెళ్లి బీజేపీలో చేరిపోయారు. అదే ఆయన చేసిన తప్పు. బీజేపీలోకి వెళ్లింది ఆయన తాత్కాలికంగానే. కానీ ధర్మవరంలో టీడీపీ బాధ్యతలను చూస్తున్న పరిటాల శ్రీరాం వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించుకున్నారు. టిక్కెట్ ఖచ్చితంగా తనదేనన్న ధీమాలో పరిటాల ఉన్నారు.
బీజేపీ నుంచి పోటీ చేస్తే....
ఇక వరదాపురం సూరి బీజేపీ నుంచి పోటీ చేస్తే ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులు కుదిరితే బీజేపీ నుంచి తాను టిక్కెట్ ను దక్కించుకునే అవకాశముంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా లేదు. దీంతో వరదాపురం సూరి వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి పోట ీ చేసే పరిస్థితులు నెలకొన్నాయి. అదే జరిగితే గెలుపు అంత సులువు కాదు. టీడీపీలోనూ డోర్లు మూసుకుపోయాయి. అందుకే వరదాపురం సూరి ఇప్పడు చేస్తున్న హడావిడి కూడా తాత్కాలికమేనంటున్నారు విశ్లేషకులు.