జగన్ హోప్స్ ఈవీఎంల వరకూ చేరుతాయా?

వైసీపీ బీసీ ఓటు బ్యాంకు పై దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో వైసీపీ పట్ల కొంత సానుకూలతను బీసీలు ప్రదర్శించారు;

Update: 2022-06-03 07:12 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలన్నీ తమ ఓటు బ్యాంకును పటిష్టపర్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ప్రధానంగా వైసీపీ బీసీ ఓటు బ్యాంకు పై దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో వైసీపీ పట్ల కొంత సానుకూలతను బీసీలు ప్రదర్శించారు. అందుకే జగన్ కు భారీ స్థాయి ఓటింగ్, స్థానాలు లభించాయి. కాపులు కూడా ఎక్కువ శాతం వైసీపీ వైపు మొగ్గు చూపారు. అయితే ఈసారి కాపు ఓట్లు వైసీపీకి రావడం కష్టమే. అది గుర్తించి తొలి నుంచి జగన్ బీసీల వైపు మొగ్గు చూపుతున్నారు.

ప్రాధాన్యత మాత్రం....
పదవుల నుంచి అన్ని స్థాయిల్లో వారికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎస్.సి, ఎస్టీ, మైనారిటీలు తమ వైపు ఉంటారన్న ధీమాతో ఉన్న జగన్ బీసీ ఓటు బ్యాంకును సాలిడ్ గా సొంతం చేసుకోవడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే వచ్చే ఎన్నికలలోనూ లబ్ది చేకూరే అవకాశముందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. బీసీలు కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ వెంట ఉన్నారు. ఎన్టీఆర్ నాటి నుంచి మొన్నటి వరకూ బీసీలు టీడీపీని సైకిల్ పార్టీని తమ సొంతంగా భావించారు. కానీ చంద్రబాబు కన్నా జగన్ ఎక్కువ తమకు ప్రాధాన్యత ఇస్తుండటంతో సైకిల్ పార్టీకి బీసీలు దూరమయ్యే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
లాభం ఎవరికి?
కానీ బీసీ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన జగన్ తమకు ఏం చేశారన్న ప్రశ్నలు బీసీల నుంచి విన్పిస్తున్నాయి. బీసీ కార్పొరేషన్ లకు కనీసం నిధులు లేవని, కేవలం పదవులతో భర్తీ చేసి చేతులు దులుపుకున్నారన్న విమర్శలున్నాయి. బీసీలకు అందరితోపాటు అందే సంక్షేమ పథకాలు మినహా కొందరు పార్టీ నేతలకే రాజకీయ పదవులు దక్కుతున్నాయన్నది వారిలో నెలకొన్న భావన. ఇటీవల రాజ్యసభ స్థానం తెలంగాణకు చెందిన నేత ఆర్ కృష్ణయ్య కు ఇవ్వడం కూడా ఎక్కువ మందికి రుచించడం లేదంటున్నారు. ఏపీలోని బీసీ నేతలకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేదని వైసీపీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఇదే నిజమైతే జగన్ కష్టం, వ్యూహం అనుకున్న మేరకు సాధ్యపడక పోవచ్చన్న వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి. బీసీల్లో ఐక్యత అనేది ఏమేరకు సాధ్యమవుతుందన్న సందేహం కూడా లేకపోలేదు.
అధినేత ఆశలన్నీ....
మంత్రి వర్గంలో ఎక్కువ మందికి స్థానం కల్పించినా, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చిన విషయంతో పాటు సామాజిక యాత్ర ద్వారా కొంత ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం వైసీీీపీ చేసింది. సామాజిక న్యాయభేరితో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రుల బస్సు యాత్ర ద్వారా బీసీలకు తమ ప్రభుత్వం ఏం చేసిందీ ప్రజలకు తెలిపే కొంత ప్రయత్నం వైసీపీ చేసింది. కానీ దీనివల్ల ఎంత మేర లబ్ది చేకూరుతుందన్నది వచ్చే ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పనున్నాయి. అధికార పార్టీ కావడంతో కొంత సానుకూల వాతావరణం పైకి కన్పిస్తున్నా క్షేత్రస్థాయిలో బీసీలు ఏమేరకు సంఘటితమవుతారన్నది చూడాలి. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో జగన్ హోప్ అంతా బీసీ ఓటు బ్యాంకు మీద మాత్రమే పెట్టుకున్నారు.


Tags:    

Similar News