జగన్ యుద్దతంత్రం ఫలిస్తుందా?
వైసీపీ అధినేత జగన్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్దమవుతున్నారు. మెజారిటీ వర్గాలను తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో పడ్డారు.
వైసీపీ అధినేత జగన్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్దమవుతున్నారు. మెజారిటీ వర్గాలను తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో పడ్డారు. అందులో సక్సెస్ అయితే మరోసారి అధికారంలోకి రావచ్చన్న అంచనాలో జగన్ ఉన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో కులాల వారీగా విడిపోయి ఎన్నికల్లో కీలక భూమిక పోషిస్తారు. అలాగే మహిళలు ముఖ్య పాత్ర పోషిస్తారు. అందుకే మహిళలను పార్టీకి అనుకూలంగా మార్చే ప్రయత్నాలు ప్రారంభించారంటున్నారు.
మహిళలను....
తొలి నుంచి అక్కా చెల్లెమ్మలంటూ జగన్ చేసిన నినాదమే ఆయనను మొదటి సారి అధికారంలోకి తెచ్చింది. మహిళలు ఎక్కువ శాతం మంది ఓటింగ్ లో పాల్గొంటారు వారు సాలిడ్ గా ఓటు చేస్తే విజయం ఖాయమవుతుంది. అందుకే జగన్ మహిళలను ఆకట్టుకునేందుకు మరికొన్ని పథకాలను రూపొందించే పనిలో ఉన్నారని చెబుతున్నారు. దీంతో పాటు మద్యనిషేధం విషయంలో కూడా జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
జిల్లాల విభజన....
ఇక జిల్లాల విభజన కూడా తనకు కలసి వస్తుందన్న అంచనాలో జగన్ ఉన్నారు. ఏపీ ఏర్పడిన సుదీర్ఘకాలం తర్వాత జగన్ తాను చెప్పినట్లు జిల్లాలను విభజించారు. 13 జిల్లాలున్న ఏపీని 26 జిల్లాలుగా మార్చారు. ఏ నిర్ణయం తీసుకున్నా అక్కడక్కడా అసంతృప్తులు సహజమే. కానీ అసంతృప్తికి మించి పార్టీకి ప్లస్ అవుతుందని వైసీపీ నేతలు అంగీకరిస్తున్నారు. ప్రధానంగా రాయలసీమ, ఉత్తరాంధ్రలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్న భావనలో ఉన్నారు.
మంత్రివర్గ విస్తరణలో...
మరోవైపు కాపు సామాజికవర్గం ఓట్లు గత ఎన్నికల్లో కొంత వైసీపీకి ప్లస్ అయినా ఈసారి ఆ సామాజికవర్గంపై జగన్ కు పెద్దగా ఆశాలు లేవు. అందుకే బీసీ మంత్రాన్ని జగన్ తరచూ జపిస్తున్నారు. బీసీలలో కనీసం 70 శాతం ఓట్లు తనవైపు తిప్పుకోగలిగినా, మరోసారి వైసీపీ విజయం ఖాయమని విశ్వసిస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీట వేసి ఫలితాన్ని తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. మరి జగన్ ఈ ఎన్నికల యుద్ధ తంత్రం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి.