అమరావతి నగరాన్ని వీలైనంత త్వరగా ఒక దశకు తీసుకురావాలనే సంకల్పంతో చంద్రబాబునాయుడు ప్రభుత్వం పనిచేస్తోందనడంలో సందేహం లేదు. చంద్రబాబునాయుడు ఫోకస్ మొత్తం అమరావతి మీదే పెడుతున్నారనే అర్థరహితమైన విమర్శలు కొందరు సంధించవచ్చు గానీ.. ప్రాధాన్యం రీత్యా, అవసరం రీత్యా కొద్దిగా ఎక్కువగా పట్టించుకుంటున్నారంతే. అమరావతి నగరాన్ని రూపుదిద్దే మహాయజ్ఞంలో అంతర్గత రోడ్లు గట్రా ఏర్పాటు చేయడం ఇప్పటికే ప్రారంభం అయింది. నిర్మాణాలు కూడా వచ్చే ఎన్నికల్లోగా కొన్నయినా పూర్తి అయ్యేలా.. చంద్రబాబునాయుడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి దాదాపుగా ప్రతి కేబినెట్ భేటీలోనూ ఏదో ఒక సంస్థకు, వ్యవస్థకు అమరావతిలో ఎకరాలకొద్దీ స్థలాలను కేటాయించేస్తున్న చంద్రబాబు.. ఆయా సంస్థల నిర్మాణాలు వచ్చే ఎన్నికల్లోగా సాకారం అయితే.. తన ప్రభుత్వానికి మన్నన దక్కుతుందనే అభిప్రాయంతో ఉన్నారు.
తాజాగా మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో వైద్య విశ్వవిద్యాలయం, ఆస్పత్రుల ఏర్పాటు తదితర వ్యవహారాలు అన్నింటికీ కలిపి సర్కారు 100 ఎకరాల స్థలం కేటాయించింది. అబుదాభికి చెందిన బిఆర్ షెట్టి మెడికల్ అండ్ హెల్త్ కేర్ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు కూడా వచ్చేశాయి. ఎకరం 50లక్షల వంతున వీరికి కేటాయించారు. అయితే ఈ విడతలో నిర్దేశించిన పనులు పూర్తిచేయడానికి చంద్రబాబునాయుడు బిఆర్ షెట్టి సంస్థకు కొన్ని డెడ్ లైన్లు కూడా విధించారు.
ఆ మేరకు వైద్య విశ్వవిద్యాలయాన్ని 2019 లో అడ్మిషన్లు జరిగేలా పూర్తి చేయాలి, సామాన్యులకు ఉద్దేశించిన 750 పడకల ఆస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రెండూ కూడా.. 2018లోనే కార్యకలాపాలు ప్రారంభించేలా భవనాలు, నిర్మాణాలు పూర్తిచేయాలి. .. ఈ రకంగా అన్ని రకాల పనులకు కూడా ప్రభుత్వం డెడ్ లైన్లు నిర్దేశించింది.
అయితే.. పనులు వేగిరం జరగడానికి, వచ్చే ఎన్నికలకంటె బాగా ముందుగానే.. అమరాతి రాష్ట్రప్రజలకు అచ్చమైన సేవలు అందించడానికి ఇలా డెడ్‌లైన్లు పెట్టడం చాలామంచిదే గానీ... డెడ్‌లైన్ లోగా సంబంధిత సంస్థ పనులు పూర్తి చేయకపోతే వారికి ఎలాంటి జరిమానాలు విధిస్తారు.. వారు ఎలాంటి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.. అనే విషయమై ఒప్పందంలోని షరతుల్లో ఎక్కడా పేర్కొన్నట్లుగా ప్రభుత్వం వెల్లడించలేదు. నిజానికి ఇది చాలా కీలకమైనది. డెడ్‌లైన్ ఎలా ఉన్నప్పటికీ.. స్థలాలు పుచ్చుకున్న సంస్థలు.. గడువులోగా పనులు చేయకుండా.. చివరి దశలో హైడ్రామా నడిపించడం కాంట్రాక్టుల విషయంలో కొత్తేమీ కాదు. ఇలాంటి చేదు అనుభవాలు అనేకం ఉన్నప్పటికీ కూడా.. ప్రభుత్వాలు.. పని సకాలంలో పూర్తిచేయని వారికి జరిమానాలను ముందుగా ఒప్పందాల్లో ఎందుకు భాగంగా చేసుకోరో అర్థం కాని సంగతి. అనుమతులు, పేదలకు పడకల కేటాయింపు వంటివి మాత్రం షరతుల్లో చేర్చిన ఏపీ సర్కారు అసలు పనులను సకాలంలో పూర్తిచేయకుంటే ఏమవుతుందో బిఆర్ షెట్టి సంస్థను హెచ్చరించేలా ఎలాంటి నిబంధన పెట్టకపోవడం గమనార్హం. మరి సదరు సంస్థలు విచ్చలవిడిగా వ్యవహరించకుండా.. పనులు అనుకున్నట్టే చేసేలా చంద్రబాబు సర్కారు ఎలా ఫాలోఅప్ చేస్తుందో!? కేవలం స్థలాలు కేటాయించడం.. వేల ఎకరాలు ఉన్నాయి కదాని.. అందరికీ పందేరం చేయడం మాత్రమే కాకుండా.. పనులను పూర్తిచేయించడాన్ని కూడా ప్రభుత్వం సీరియస్ గా పట్టించుకుంటుందని ఎలా నిరూపించుకుంటారో చూడాలి.