తెలంగాణ రాష్ట్రాన్ని డిజిటల్ తెలంగాణ గా ఆవిష్కరింపజేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అంటున్నారు. ప్రజలు తమ లావాదేవీలు సులువుగా చేపట్టడమే లక్ష్యంగా ఈ చర్యలన్నీ తీసుకుంటున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. దీనికోసం అన్ని ప్రభుత్వ, ప్రెవేటు లావాదేవీల్లో పారదర్శకత ఉండేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాం అంటూ కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలో డిజిటల్ లావాదేవీలను పెంచడానికి ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశానికి కేటీఆర్ అధ్యక్షత వహించారు.
నోట్ల రద్దుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్న తొలి ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ కూడా ఒకరని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఇబ్రహీంపూర్ మొట్టమొదటి నగదురహిత గ్రామంగా ఇప్పటికే ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు. అక్కడ యూపీఐ, పీఓఎస్ మెషిన్లను, రూపే కార్డులను, క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపుల పద్ధతులను అనుసరిస్తున్నట్లు కూడా కేటీఆర్ వెల్లడించారు. ఇందుకోసం జరుగుతున్న మొత్తం కసరత్తులో డిజిటల్ చెల్లింపుల పద్ధతుల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించడం, వారిలో సానుకూల చైతన్యం తీసుకురావడం అనేవి కీలకమైన అంశాలుగా కేటీఆర్ అభివర్ణించారు.
ప్రజలు అన్ని రకాల లావాదేవీలను డిజిటల్ రూపంలో చేపట్టేలా తమను తాము తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిలషించారు. తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఆండ్రాయిడ్ యాప్ టీవ్యాలెట్ స్వరూపస్వభావాలు ఎలా ఉండబోతున్నాయో కూడా కేటీఆర్ స్థూలంగా వివరించారు. దీని ద్వారా అన్ని వర్గాలకు చెందిన , సామాజిక తరగతులకు చెందిన ప్రజలు కూడా సులువుగా లావాదేవీలు చేపట్టడానికి వీలుగా రూపొందిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. నగదు లావాదేవీలనుంచి డిజిటల్ లావాదేవీలకు మళ్లే వినియోగదారులకు మరింత ప్రోత్సాహం ఇచ్చేలా పని సాఫీ జరిగిపోతుందనే విశ్వాసం కలిగేలా బ్యాంకర్లు కూడా చర్య తీసుకోవాల్సి ఉందని కేటీఆర్ కోరారు.
ఈ సమావేశంలో ప్రతిపాదిత టీ-వ్యాలెట్ ఎలా ఉండబోతున్నది అనే విషయమై ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ సవివరమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను అందించారు. టీవ్యాలెట్ లో అసమానమైన ఫీచర్లతో పాటు, చక్కటి రక్షణ వ్యవస్థలను కూడా అంతర్గతంగా రూపొందించినట్లు రంజన్ వివరించారు. డిసెంబరు 7వ తేదీనుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల అవగాహన ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు జయేష్ రంజన్ వెల్లడించారు. సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, జగదీశ్ రెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.