పీవీ తనయుడు రాజేశ్వరరావు కన్నుమూత

Update: 2016-12-12 23:43 GMT

దివంగత ప్రధాని పివి నరసింహారావు తనయుడు, మాజీ ఎంపీ పివి రాజేశ్వరరావు దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. 68 ఏళ్ల రాజేశ్వరరావు హైదరాబాదులోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

1991లో పీవీ నరసింహారావు ప్రధాని అయిన తర్వాత.. రాజేశ్వరరావు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా చదివిన రాజేశ్వరరావు, సికింద్రాబాద్ నుంచి 1996లో లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం 1998 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

స్వతహాగా ప్లేబ్యాక్ సింగర్ కావాలనేది రాజేశ్వరరావు కోరికగా ఉండేది. ఆయన ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లలో అనేక లలిత సంగీత కార్యక్రమాల్లో గానం చేశారు. ఆ తరువాతే ఆయన తన రాజకీయాసక్తిని కనబరచడం జరిగింది. వ్యవసాయంలో కూడా సమానమైన ఆసక్తి ఉన్న రాజేశ్వరరావు, అనేక సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఉండేవాళ్లు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి దత్తాత్రేయ, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు రాజేశ్వరరావు మృతి పట్ల తీవ్ర సంతాపం వెలిబుచ్చారు.

Similar News