ప్రశ్నించడం మీ హక్కు.. దాన్ని వదులుకోవద్దు అంటూ పవన్ కల్యాణ్ పదేపదే తన అభిమానులకు మార్గదర్శనం చేస్తుంటారు. అలాంటి పవన్ కల్యాణ్ ఇప్పుడు భాజపా సర్కారు మీద ప్రత్యక్షయుద్దాన్ని ప్రకటించినట్టే. అయిదు అంశాలపై కేంద్రంలోని భాజపా సర్కారు ను నిలదీయనున్నట్లు పవన్ కల్యాణ్ తన యాక్షన్ ప్లాన్ ను గురువారం వెల్లడించారు. మొత్తం అయిదు అంశాల మీద కేంద్రాన్ని ప్రశ్నించనున్నట్లు పేర్కొన్నారు.
గోవధ, రోహిత్ వేముల, నోట్ల రద్దు, దేశభక్తి, ఏపీకి స్పెషల్ స్టేటస్, లాంటి అంశాలమీద కేంద్రాన్ని నిలదీయనున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు.
తొలిరోజునాడు.. గోవధ పై పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. భాజపాకు చిత్తశుద్ధి ఉంటే గనుక.. భాజపా పాలిత రాష్ట్రాల్లో బీఫ్ ను ఎందుకు నిషేధించడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. రేపు రోహిత్ వేముల అంశం పై తన అభిప్రాయాలను ట్వీట్ ద్వారా తెలియజేయనున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు.
మొత్తానికి జనసేన అధినేత ప్రత్యక్ష సమరానికి సిద్ధం అయినట్లుగానే ఉన్నది. మరి.. ఎన్నికలలో తమ కూటమి విజయానికి పవన్ కల్యాణ్ ఎంతో కొంత ఉపయోగపడ్డాడనే సానుభూతితో ఇన్నాళ్లూ కాస్త మెతగ్గా వ్యవహరించిన భాజపా దళాలు.. పవన్ ప్రత్యక్ష పోరాటం నేపథ్యంలో ఎలా స్పందిస్తాయో చూడాలి.