సేవలు అమ్ముదాం.. సొమ్ములు తెద్దాం  : చంద్రబాబు

Update: 2016-12-13 13:56 GMT

ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో సింగపూర్ తరహా విధానాన్ని అసుసరించడంలో మెరుగైన ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. సొంత ఆర్థిక వనరులతో పాటు బయటి దేశాలలో పెట్టుబడులు పెట్టి సింగపూర్ ఆదాయ మార్గాలను పెంచుకుంటోందని ఆయన గుర్తుచేశారు. ఏపీ సైతం తనకు బలమున్న రంగాలలో బయటి రాష్ట్రాలకు సేవలందించడం ద్వారా ఆదాయం పెంచుకునేందుకు గల అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ముఖ్యమంత్రి ఆర్ధిక శాఖ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

ప్రభుత్వం పెట్టే ఖర్చులో ఆఖరి మైలురాయి వరకు అందే ప్రతి రూపాయి కూడా లెక్కల్లో కనిపించాలని ముఖ్యమంత్రి కోరారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య ఆర్థిక వ్యవహారాలన్నీ ఇప్పటికే డిజిటలైజ్ చేశామని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లామ్ ముఖ్యమంత్రికి వివరించారు. ఆర్థిక వ్యవహారాలన్నీ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నామని, ఎక్కడా మానవ సహిత లావాదేవీలు లేవని చెప్పారు. అయితే, ట్రెజరీ, బ్యాంకులు, ఆర్‌బీఐ మధ్య సరైన అనుసంధానం లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

అక్టోబరు మాసంతో పోల్చితే నవంబరులో రాష్ట్ర సొంత వనరుల ఆదాయం రూ.200 కోట్లు తగ్గిందని ఆర్థికశాఖ అధికారులు చెప్పారు. బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఈ సంవత్సరం ఇప్పటి వరకు వున్న అన్ని బిల్లులను క్లియర్ చేశామని ఆయన ముఖ్యమంత్రికి తెలియజేశారు. నీరు-చెట్టు వంటి కార్యక్రమాలకు సంబంధించి బడ్జెటేతర కేటాయింపులకు సంబంధించిన బిల్లుల్ని క్లియర్ చేయాలని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టుకు వెచ్చించిన నిధుల్లో రూ.వెయ్యికోట్లు నాబార్డు నుంచి త్వరలో అందనున్నాయని, ఆ నిధులు వస్తే కొంత ఆర్థిక వెసులుబాటు వుంటుందని అధికారులు వివరించారు. మునిసిపల్, ఆర్‌అండ్‌బీ, జలవనరుల శాఖలకు సంబంధించి బడ్జెటేతర ఖర్చుకు సంబంధించిన రూ.1400 కోట్లు సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి ఆర్థికశాఖ అధికారులకు సూచించారు. నిధుల వినియోగంలో ప్రభుత్వ శాఖల మధ్య కన్వర్జెన్సీ వుండేలా చూడాలని కోరారు. వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే రుణాలకు సంబంధించి అతి తక్కువ వడ్డీ వుండేలా చూసుకోవాలన్నారు. ఎక్స్‌టెర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల గురించి సమావేశంలో సమీక్షించారు. కొత్తగా అభివృద్ధి చేసిన సీఎఫ్‌ఎంఎస్ గురించి అధికారులు ముఖ్యమంత్రికి కొన్ని వివరాలు అందించారు.

Similar News