బాబు అవినీతి అనకొండ : అంబటి

చంద్రబాబు అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, ప్రతి ఒక్కరికీ తెలుసునని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

Update: 2023-09-11 06:25 GMT

చంద్రబాబు అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, ప్రతి ఒక్కరికీ తెలుసునని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒక రాజకీయ నేత అరెస్ట్ కావడం జైలుకెళ్లడం బాధాకరమే అయినప్పటికీ అరెస్టయిన రాజకీయ నేత జీవితాన్ని ఒకసారి చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఇన్నాళ్లు ఎవరికీ దొరక్కుండా తప్పించుకున్నారని, ఈరోజు ఈ స్కామ్ లో ఆయన అడ్డంగా దొరికిపోయారని అంబటి రాంబాబు అన్నారు.

వ్యవస్థలను మేనేజ్ చేసి...
ఎన్ని కేసులొచ్చినా ఎవరికి దొరక్కుండా వ్యవస్థలను మేనేజ్ చేసుకుని ఇప్పటి వరకూ చంద్రబాబు కాలం నెట్టుకొచ్చారన్న అంబటి ఈ స్కామ్ లో తప్పించుకోలేరని, అవినీతికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు లభించిన తర్వాతనే ఆయనను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఇదొక్క కుంభకోణమే కాదని, ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వంటి కేసులు చంద్రబాబు మెడపై వేలాడుతున్నాయని అంబటి రాంబాబు అన్నారు. చివరకు ఓటుకు నోటు కేసులో కూడా వ్యవస్థలను తనకు అనుకూలంగా మలచుకుని తప్పించుకున్నారని అంబటి రాంబాబు విమర్శించారు.
పిలుపిస్తే...
అరెస్ట్ కావడం పెద్ద అపరాధం మాదిరిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అరెస్ట్ కు నిరసనగా పార్టీ నేతలు బంద్ కు పిలుపిస్తే ఎవరూ రోడ్డు మీదకు రాకపోవడం కూడా ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పూర్తిగా స్పృహ కోల్పోయి వ్యవహరిస్తున్నారని అక్రమాలు చేసిన చంద్రబాబును సమర్థించి నవ్వుల పాలవుతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు నేరాలు కొత్తేమీ కాదని, ఆయన అవినీతిని గుర్తించి అరెస్ట్ చేయడమే ఇప్పుడు కొత్త అని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని కూడా ఆయన టీడీపీ శ్రేణులకు హెచ్చరించారు.


Tags:    

Similar News