బాబు స్కిల్డ్ క్రిమినల్ : విజయసాయి

అవినీతి కేసులో చంద్రబాబు అరెస్ట్ ను టీడీపీ నేతలు జీర్ణించు కోలేకపోతున్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు.

Update: 2023-09-12 13:00 GMT

అవినీతి కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ బంద్ కు అసలు స్పందనలేదన్న ఆయన హెరిటేజ్ సంస్థనే మూసివేయలేదని ఎద్దేవా చేశారు. ప్రజలు చంద్రబాబు అరెస్ట్ ను పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు విద్యార్థి దశ నుంచే నీచమైన రాజకీయాలు చేశారని విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు నీతిమంతుడని ఎవరూ అనుకోవడం లేదని అన్నారు.

షెల్ కంపెనీల ద్వారా...
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో కోట్లాది రూపాయలు చేతులు మారాయన్న ఆధారాలున్నాయన్నారు. షెల్ కంపెనీల ద్వారా వివిధ అకౌంట్‌లలోకి నిధులను మళ్లించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నేతల మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర రాజకీయాలను భ్రష్టుపట్టించింది చంద్రబాబు మాత్రమేనని అన్నారు. రాజకీయాలను సామాన్యులను దూరం చేసింది చంద్రబాబు మాత్రమేనని, ఖరీదైన ఎన్నికలను తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనకే చెల్లుతుందన్నారు.
వ్యవస్థలను మేనేజ్ చేసి...
నేరపూరితమైన తెలివితేటల్లో అన్ని వ్యవస్థల్లో తన సామాజికవర్గం వారిని పెట్టుకుని భ్రష్టు పట్టించారని చంద్రబాబుపై విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇప్పటి వరకూ అనేక కేసుల్లో స్టే తెచ్చుకుని ఆయన ఇప్పటి వరకూ జైలుకు వెళ్లలేదన్నారు. ఏలేరు స్కామ్ నుంచి మొన్న అమరావతి కేసు వరకూ ఇదే జరుగుతుందన్నారు. ఆయన హయాంలో ప్రతిదీ ఒక్క స్కామ్ అని దుయ్యబట్టారు. అమరావతి నిర్మాణం నుంచి పోలవరం, పట్టిసీమల్లో కూడా పెద్దయెత్తున కమీషన్లు దండుకున్నారని అన్నారు. చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్ అని అన్నారు. నిజంగా ఎటువంటి అవినీతి చేయకపోతే స్టేలు ఎందుకు తెచ్చుకున్నారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.


Tags:    

Similar News