ఇప్పటంలో 144 సెక్షన్ అమలు
ఇప్పటంలో మళ్లీ కూల్చివేతలపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. గతేడాది జనసేన..
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్రమణల పేరుతో.. అధికారుకు పలు నిర్మాణాలను కూల్చివేయడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారుల తీరుతో వారంతా ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఇప్పటంలో మరోసారి 144 సెక్షన్ విధించారు పోలీసులు. గ్రామంలో ప్రజలెవరూ గుంపులు గుంపులుగా కనిపించరాదని హెచ్చరించారు.
కాగా.. ఇప్పటంలో మళ్లీ కూల్చివేతలపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. గతేడాది జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం ఇప్పటం గ్రామస్తులు భూమి ఇచ్చారన్న కక్షతోనే ప్రభుత్వం కూల్చివేతలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. వైసీపీ నేతలకు ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారన్నారు. శని, ఆదివారాల్లోనే కూల్చివేతలు నిర్వహించడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఎందుకింత మూర్ఖత్వమని ప్రశ్నించారు. పరిపాలనా దక్షత లేదు. పరిజ్ఞానం లేదు అని విమర్శించారు. 4 వేల జనాభా ఉన్న చిన్న గ్రామంలో ఇప్పటికే 80 అడుగుల రోడ్డు ఉంటే, దాన్ని 120 అడుగులకు పెంచుతున్నామని చెబుతూ ఆక్రమణల పేరిట కూల్చివేతలు నిర్వహించడం సరికాదని సూచించారు.