Andhra Pradesh : ఏపీ కేబినెట్ సమావేశంలో ఆ మంత్రులకు చంద్రబాబు వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ముఖ్యమైన అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ముఖ్యమైన అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే తర్వాత రాజకీయ పరమైన అంశాలపై చర్చ జరుగుతుంది. కొందరు మంత్రులపై చంద్రబాబు సమావేశంలో అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రులే ఇలా వ్యవహరిస్తే క్యాడర్ కు ఎలాంటి సంకేతాలను పంపుతామని ప్రశ్నించినట్లు తెలిసింది. ఇటీవల నూజివీడులో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగిరమేష్ పాల్గొనడం, అక్కడే మంత్రులు,టీడీపీ నేతలు కూడా ఉండటం ప్రస్తావించినట్లు సమాచారం. దీనిపై క్యాడర్ నుంచి పెద్దయెత్తున నిరసన వ్యక్తమవుతుందని చంద్రబాబు అన్నట్లు సమాచారం.
పనితీరుపై కూడా...
మంత్రులు ఒక కార్యక్రమానికి వెళ్లే ముందు అందులో ఎవరెవరు పాల్గొంటున్నారన్న విషయం ముందుగా తెలుసుకోవాలని, లేకుంటే ఇలాంటి ఇబ్బందులే వస్తాయని అన్నారని తెలిసింది. ఇక మంత్రులకు మార్కులను కూడా చంద్రబాబు వేసినట్లు తెలిసింది. పవన్ కల్యాణ్, లోకేష్, గొట్టిపాటి రవికుమార్, వంగలపూడి అనిత వంటి వారు మాత్రమే పనితీరులో బాగా మెరుగ్గా కనిపిస్తున్నారని, మిగిలిన మంత్రుల్లో చాలా మంది ఇంకా నేర్చుకోవాల్సి ఉందని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం ఏర్పాటయి ఆరు నెలలు గడుస్తున్నా ఇంకా శాఖలపై పట్టు రాకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. పనితీరు మార్చుకోకుంటే తాను రాజకీయపరమైన కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు తెలిసింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now