రాజమహేంద్రవరంలో పసుపు పండుగ

చారిత్రక నగరం రాజమహేంద్రవరం పసుపుమయమైంది. రేపు, ఎల్లుండి ఇక్కడి వేమగిరిలో మహానాడు జరగనుంది.

Update: 2023-05-26 02:46 GMT

చారిత్రక నగరం రాజమహేంద్రవరం పసుపుమయమైంది. రేపు, ఎల్లుండి ఇక్కడి వేమగిరిలో మహానాడు జరగనుంది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు చరిత్రలో నిలిచిపోయేలా.. రాజమహేంద్రవరంలో పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సారి ప్లీనరీ, బహిరంగ సభలకు వేరు వేరు చోట్ల వేదికలు ఏర్పాటు చేశారు. రేపు సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రతినిధుల సభ జరగనుంది. ఎల్లుండి 60 ఎకరాల్లో మహానాడు భారీ బహిరంగ సభ జరగనుంది. పార్కింగ్‌ స్థలానికి, భోజన స్టాళ్లకు కూడా పెద్ద ఎత్తున స్థలం కేటాయించారు.

మహానాడు నేపథ్యంలో రాజమహేంద్రవరంలో పసుపు జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రతినిధుల సభలో ఎన్టీఆర్‌, చంద్రబాబు హయాంలో పేదలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, డెవలప్‌మెంట్‌పై డిజిటల్‌ ఫొటో డిస్‌ప్లే కార్యక్రమం ఉంటుంది. లోకేష్‌ పాదయాత్ర స్పందనలను కూడా ప్రదర్శించనున్నారు. ముఖ్య నేతలతో మీటింగ్‌, వీఐపీ లాంజ్‌, ప్రతినిధులు భోజనం చేసేందుకు భారీ షెడ్‌ని నిర్మించారు. ఎల్లుండి (మే 28వ తేదీ) ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఉదయం 10 గంటలకు చంద్రబాబు, పార్టీ నాయకులతో కలిసి కోటిపల్లి బస్టాండ్‌లో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత మహానాడు బహిరంగ సభ జరుగుతుంది. సభకు 15 లక్షల మంది వస్తారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

వారి కోసం 20 లక్షలకుపైగా వాటర్‌ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు రెడీ చేస్తున్నారు. సభకు వచ్చే వారికి గోదావరి రుచులు అందించనున్నారు. సభకు వచ్చే వారి కోసం పెద్ద మొత్తంలో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడుకు తరలి రావాలని ఇప్పటికే పార్టీ నాయకులకు చంద్రబాబు తన డిజిటల్‌ సిగ్నేచర్‌తో ఇన్విటేషన్‌ పంపారు. ఇక ఇవాళ మధ్యాహ్నం చంద్రబాబు రాజమహేంద్రవరం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు టీడీపీ పొలిట్‌బ్యూరో మీటింగ్‌ జరుగుతుంది. ఈ సందర్భంగా మహానాడులో ప్రవేశపెట్టనున్న తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలియజేయనున్నారు. రేపు జరిగే ప్రతినిధుల సభలోనే పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు, పార్టీ కార్యవర్గాల్ని నియమిస్తారు.

Tags:    

Similar News