Weather Report : వెరైటీ వెదర్... ఉదయం ఎండ.. సాయంత్రం వర్షం
రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది;

రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు బంగాళాఖాతంలో ఉత్తరం వైపునకు అల్పపీడనం కదిలే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. దీంతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా చెప్పింది.
బలమైన గాలులు...
బలమైన గాలులు వీచే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. దక్షిణ కోస్తా జిల్లాలోనూ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక్కడ కూడా ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. రాయలసీమ జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముంని పేర్కొంది. ఇక్కడ ఈదురుగాలులు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని, మరికొన్ని చోట్ల పిడుగులు పడతాయని హెచ్చరించింది.
ఎల్లో అలెర్ట్ జారీ...
తెలంగాణలోనూ పలు చోట్ల మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని, వడగళ్ల వాన కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక్కడ కూడా ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గంటకు ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. పలు చోట్ల భారీ వర్షం పడే అవకాశముందని తెలిపింది.
ఉష్ణోగ్రతలు తగ్గి...
ఇక ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నగర ప్రజలు రెండు రోజుల నుంచి ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఇన్నాళ్లు నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అట్టుడికిపోయిన ప్రజలకు కొంత మేరకు ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. అయితే సాయంత్రం వేళ మాత్రమే వర్షం పడుతుందని, ఉదయం నుంచి గరిష్టంగా అంటే 36 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విభిన్నమైన వాతావరణం నెలకొంది.