చంద్రబాబు అంటే కరువే

రైతులకు ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు;

Update: 2022-11-28 06:35 GMT

రైతులకు ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. సున్నావడ్డీ రాయితీ, ఇన్‌పుట్ సబ్సిడీని రైతులకు జగన్ అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఇప్పటి వరకూ 1,834 కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీని రైతులకు అందించామని తెలిపారు. గతంలో వైఎస్సార్ రైతు భరోసా వంటి పథకం లేదని ఆయన అన్నారు. వరసగా మూడో ఏడాది సున్నా వడ్డీ పథకంలోని రాయితీని జమ చేస్తున్నామని జగన్ తెలిపారు. పంటరుణాలు ఏడాదిలో తీర్చిన రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని అందచేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు సున్నావడ్డీ పథకాన్ని రైతులకు ఎగ్గొట్టారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు రుణ మాఫీ కోసం 15 వేల కోట్ల రూపాయలే ఇచ్చారని జగన్ అన్నారు. గత ప్రభుత్వంలో అశాస్త్రీయ పద్ధతుల్లో రైతుల పథకాలు జరిగేవన్నారు.

వివిధ పథకాల ద్వారా...
లబ్దిదారుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీలో కొత్తఒరవడిని సృష్టించామని తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. విత్తనాలు, పురుగు మందులు, ఎరువులను ఆర్బీకే ల ద్వారా ఇస్తున్నామని తెలిపారు. ప్రతి పథకం పారదర్శకంగా అర్హులైన రైతులకు అమలు చేస్తున్నామని జగన్ అన్నారు. రైతు భరోసా కింద వైసీపీ ప్రభుత్వం 25,971 కోట్ల రూపాయలు ఇచ్చిందని తెలిపారు. గతంలో రైతులకు ఇటువంటి పథకాలను ఏ ప్రభుత్వం చేసింది లేదన్నారు. పంట కొనుగోలు సమయంలోనూ ఆర్బీకేల ద్వారా రైతులకు న్యాయం చేస్తున్నామని జగన్ తెలిపారు.
వర్షాలు కురిసి...
ఈ మూడున్నరేళ్లలో దేవుడి దయవల్ల ఒక్క కరువు మండలం కూడా లేదన్నారు. చంద్రబాబు హయాంలో ప్రతి ఏడాది కరువు వచ్చేదని ఆయన అన్నారు. చంద్రబాబు పాలనలో కరవు వల్ల నష్టపోయిన రైతులకు ఏమాత్రం నాటి ప్రభుత్వం సాయం అందించలేదని జగన్ అన్నారు. భారీ వర్షాలకు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీలను అందచేస్తున్నామని తెలిపారు. పాల దిగుబడి పెంచేందుకు, వారికి గిట్టుబాటు ధరను కల్పించేందుకు అమూల్ సంస్థను తీసుకువచ్చామన్నారు. ధాన్య సేకరణలోనూ ప్రభుత్వం గతంలో కంటే ముందుందని ఆయన అన్నారు.


Tags:    

Similar News