సోనూ నువ్వు నిజంగా బంగారమయ్యా?
ఆంధ్రప్రదేశ్ వరదలతో ఇబ్బంది పడుతోంది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్షల ఎకరాలు నీట మునిగాయి.
ఆంధ్రప్రదేశ్ వరదలతో ఇబ్బంది పడుతోంది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్షల ఎకరాలు నీట మునిగాయి. వేలాది మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. అయితే టాలివుడ్ నటులు పెద్దగా స్పందించలేదు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వరదలకు గతంలో స్పందించిన హీరోలు ఏపీలో జరిగిన వరద నష్టంపై చేయూతనివ్వడం లేదు. అయితే ఇతర రాష్ట్రమైనా టాలీవుడ్ లో నటుడిగా పేరు సంపాదించుకున్న సోనూ సూద్ మాత్రం తానున్నానని ముందుకొచ్చారు.
ఏపీ వరదలపై....
కరోనా సమయంలోనూ సోనూ సూద్ అనేక మందికి సేవలందించారు. వలస కార్మికులను ఇంటికి చేర్చడమే కాకుండా అత్యవసరమైన వారికి ఆక్సిజన్ అందించి సోనూ సూద్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇక ఏపీ వరదల విషయానికొస్తే సోనూ సూద్ సాయం చేయడానికి ముందుకు వచ్చారు. తన ఫౌండేషన్ ద్వారా నెల్లూరు జిల్లాలో వరద బాధితులను ఆదుకుంటున్నారు.
రెండు వేల కుటుంబాలకు...
దాదాపు రెండు వేల కుటుంబాలకు సోనూసూద్ నిత్యావసర సరుకులతో పాటు కావాల్సిన సామగ్రిని అందచేస్తున్నారు. సూద్ ఛారిటీ ఫౌండేషన్ వాలంటీర్లు నేరుగా వెళ్లి బాధితులకు సాయం చేస్తారు. తమ సినిమాలకు టిక్కెట్ల రేట్లను పెంచమని కోరే మన హీరోలు సాయం విషయంలో మాత్రం ఏపీపై దయ చూపడం లేదు.