తిరుమలలో ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. గురువారం అయినప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో రావడంతో రద్దీ ఏమాత్రం తగ్గలేదు. నిన్న క్రిస్మస్ నేడు బాక్సింగ్ డే సెలవు దినాలు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు క్యూ కట్టారు. తిరుమలలోని వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట వరకూ క్యూ లైన్ విస్తరించి ఉండటంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే సమయంలో క్యూ లో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి సేవకులు అన్న ప్రసాదాలను, మజ్జిగను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. దర్శనానికి గంటల సమయం పడుతుండటంతో గోవింద నామసర్మరణలతో క్యూలైన్ లలో ఉన్నభక్తులు ముందుకు సాగుతున్నారు. వరస సెలవులు రావడంతో ఇంత అధికంగా భక్తులు వచ్చారని, వారికి అవసరమైన ఏర్పాట్లు చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
నేడు ఆన్ లైన్ లో టిక్కెట్లు...
మరోవైపు నేడు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆన్ లైన్ లో టిక్కెట్లను విడుదల చేస్తున్నారు. మార్చి నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. అలాగే మార్చి నెలకు సంబంధించి తిరుమలలోని వసతి గృహాల కోసం ఈరోజు మూడు గంటల నుంచి ముందుగానే బుక్ చేసుకోవడానికి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయి. భక్తులు ఆన్ లైన్ లో మార్చి నెలలో దర్శనం, వసతి గృహాలను ముందుగానే ఈరోజు బుక్ చేసుకునే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఇరవై గంటల సమయం...
ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. గత మూడు రోజుల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఈ ఏడాది చివరి వారం కావడంతో తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ముందుగానే అంచనా వేసిన టీటీడీ అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ బయట ఎంబీసీ వరకూ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 73,301 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,242 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.14 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ