గర్జన చేసేందుకు సిగ్గుందా?
వికేంద్రీకరణ పై ప్రజలను మోసం చేయడానికి విశాఖ గర్జన చేస్తున్నారని వంగలపూడి అనిత అన్నారు
విశాఖలో భూమి యజమానుల మెడ మీద కత్తి పెట్టి విజయసాయిరెడ్డి ఐదు వేల కోట్ల విలువైన దసపల్లా భూములను కొల్లగొట్టారని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. అతిపెద్ద స్కామ్ గా విశాఖ భూదందాను చెప్పుకోవచ్చని అన్నారు. విశాఖ ఎంపీ కోట్లాది రూపాయల ప్రజల భూమిని దోచుకున్నారన్నారు. రాజధాని రైతులు అరసవిల్లి వరకూ వస్తే వీరి బండారం బయటపడుతుందని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జేఏసీ అంటే జగన్ యాక్షన్ కమిటీ అని ఆమె అన్నారు.
ప్రజలను మోసం చేయడానికి...
వికేంద్రీకరణ పై ప్రజలను మోసం చేయడానికి విశాఖ గర్జన చేస్తున్నారని వంగలపూడి అనిత అన్నారు. బిల్లు కాకుండా మూడు రాజధానులు ఎలా అవుతాయని ఆమె ప్రశ్నించారు. ఈ మూడేళ్లలో విశాఖను ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. విశాఖలో చిన్న ఇటుక ముక్క కూడా వేయకుండా తాకట్టు పెట్టేస్తున్నారన్నారు. విశాఖపట్నంలోని 100 ఎకరాల ప్రభుత్వ భూమిని తాకట్టు పెట్టేశారన్నారు. ఏ మొహంతో గర్జన పెడుతున్నారని వంగలపూడి అనిత ప్రశ్నించారు. విశాఖ రైల్వే జోన్ ఏమయిందని ఆమె నిలదీశారు. రైల్వే జోన్ గురించి గర్జన పెట్టకుండా చట్టమే లేని పరిపాలన రాజధాని కోసం ఎందుకు పెడుతున్నారన్నారు.