విశాఖలో సీఎం జగన్ పర్యటన
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్చి 5-7 తేదీల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్చి 5-7 తేదీల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. 5వ తేదీన మేధావులు, పారిశ్రామికవేత్తలతో కలిసి డైలాగ్ ఆన్ డెలివరీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ ఐదేళ్లల్లో విశాఖలో జరిగిన అభివృద్ధి.. ప్రభుత్వ లక్ష్యాలను చెప్పేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. వైజాగ్ అభివృద్ధిపై ప్రభుత్వ చిత్తశుద్ధి, నిబద్ధతను తెలియజేయనున్నారు. ఈ సమావేశంలో సీఎం నగర అభివృద్ధి కోసం మేధావులు, పారిశ్రామికవేత్తల నుంచి సలహాలు తీసుకోనున్నారు. అనకాపల్లిలో జరిగే ‘చేయూత’ బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. సీఎం రెండు రోజుల పర్యటన ఏర్పాట్లపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ జిల్లా కలెక్టర్, అధికారులతో సమావేశమయ్యారు.
మార్చి 7న సీఎం జగన్ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారని.. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. అనకాపల్లిలో వైయస్సార్ చేయూత కార్యక్రమం నిర్వహించబోతున్నామని.. సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళలకు సంబంధించిన చేయూత నిధులను విడుదల చేయనున్నారన్నారు. అనకాపల్లిలో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. వైసీపీ సంక్షేమ పథకాలు జనానికి ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. మరోసారి వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని తెలిపారు.