Thalliki Vandanam: తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చేసిన ఏపీ ప్రభుత్వం

తల్లికి వందనం పథకంపై జరుగుతున్న ప్రచారంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది

Update: 2024-07-13 02:54 GMT

తల్లికి వందనం పథకంపై జరుగుతున్న ప్రచారంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఎన్నికల ప్రచారంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఇస్తామని కూటమి నేతలు చెప్పారని, కానీ జీవోలో తల్లికి మాత్రమే అని ఉందంటూ ఆరోపణలు రాగా.. దీనిపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వివరణ ఇచ్చారు. ఆధార్ ఉత్తర్వుల జీవోను చూపించి తల్లికి వందనం జీవో అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తల్లికి వందనం పథకంపై మార్గదర్శకాలను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత అందరికీ తెలియజేస్తామన్నారు. తల్లికి వందనం పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదని.. కేంద్రం ఆధార్ నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులనే విడుదల చేశామని చెప్పారు. ఈ పథకానికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలను ఇవ్వలేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని అసలు నమ్మవద్దని తెలిపారు.

"కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధార్ చట్టం 2016, రెగ్యులేషన్ 15, సెక్షన్ 7, మరియు దాని సవరణలు, అనుబంధ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని ప్రభుత్వశాఖలు ఏవైనా పథకాల యొక్క లబ్ధిదారులను గుర్తించుటకు ఆధార్ ఉపయోగించదలచినచో గెజిట్ పబ్లికేషన్ చేసి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న UIDAI నుండి కావలసిన అనుమతులు పొందవలసి ఉన్నది. దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 43/2023 చట్టము కూడా తీసుకురావడము జరిగినది. అలాగునే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ITE&C డిపార్ట్మెంట్ వారు ఉత్తర్వులు తేదీ 21.05.2021 ద్వారా ఇదే విషయము తెలియజేస్తూ ప్రభుత్వ శాఖల వారు గెజిట్ పబ్లిష్ చేయ వలసినదిగా తెలియజేశారు. లేనియెడల, ఆధార్ సేవలలో అంతరాయం కలుగునని కూడా తెలియజేశారు. దీనికనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వంలోని అనేక శాఖలు ఆధార్ వినియోగించుటకు ఇటువంటి గెజిట్ పబ్లికేషన్లు ఇదివరకే ఇవ్వడం జరిగినది.
సందర్భంలోనే కమిషనర్, పాఠశాల విద్యాశాఖ వా లతో, పాఠశాల విద్యాశాఖ GO MS 29 తేది 09.07.2024 కూడా ఆధార్ వినియోగించుటకు గెజిట్ పబ్లికేషన్ ఇవ్వడం జరిగినది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ ఆధార్ నిబంధనలకు అనుగుణంగా తీసుకున్న చర్య మాత్రమే." తల్లికి వందనం" పథకం సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం ఇంకనూ ఖరారు చేయవలసి ఉన్నది. పైన తెలిపిన జీవోలో "తల్లికి వందనం" పథకమునకు సంబంధించి ఇప్పటివరకూ, ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వబడలేదు. ఇది ఆధార్ నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రమే అని తెలియజేయడమైనది.
కానీ, కొన్ని వార్తా పత్రికలలో మరియు సామాజిక మాధ్యమాలలో ఈ జీవో ని చూపిస్తూ "తల్లికి వందనం" పథకం పేరిట తప్పుడు ప్రచారం జరుగుతున్నది. కాబట్టి అటువంటి వార్తలు అవాస్తవమని తెలియజేస్తూ, వాటిని నమ్మవద్దు అని తెలియజేయడమైనది.
"తల్లికి వందనం" పథకం మార్గదర్శకాలు మరియు విధివిధానాలు ప్రభుత్వం రూపొందించిన తరువాత తెలియజేయబడును. అప్పటివరకు ఎటువంటి అవాస్తవ కథనాలను నమ్మొద్దని కోరడమైనది." అంటూ పత్రికా ప్రకటన వచ్చింది.


Tags:    

Similar News