YSRCP : వైసీపీకి మళ్లీ మంచిరోజులొచ్చినట్లేనా? కేవలం ఏడాది గడవక ముందే ఇంత మార్పా?
వైసీపీ క్రమంగా ఆంధ్రప్రదేశ్ లో పట్టు బిగిస్తుంది. ముఖ్యంగా నేతలు, క్యాడర్ లో ఇప్పుడు కసి కనిపిస్తుంది;

వైసీపీ క్రమంగా ఆంధ్రప్రదేశ్ లో పట్టు బిగిస్తుంది. ముఖ్యంగా నేతలు, క్యాడర్ లో ఇప్పుడు కసి కనిపిస్తుంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలే కారణం. రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, జడ్పీ ఛైర్మన్ లకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ నేతలు, క్యాడర్ నిలబడి పార్టీని గెలిపించుకున్నారు. తమకు తాము ఎక్కడికక్కడ ఎవరి ఆదేశాలు లేకుండానే ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ పార్టీని గెలిపించుకున్నారు. దాదాపు 30 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిస్తే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కేవలం పదకొండుకే పరిమితమయ్యారు. జనసేనకు ఒకటి లభించింది. ఎన్నికలు జరిగిన ఏడాదిలోనే ఇంత మార్పు కనిపించడంతో ఇది నేతలు, క్యాడర్ లో వచ్చిన మార్పు కాదని, ప్రజల్లో వస్తున్న మార్పునకు సంకేతమని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.
తెలంగాణతో పోల్చుకుంటూ...
పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటక ముందే ఎన్నికలకు ముందు ఇచ్చిన అనేక హామీలను అమలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు, రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత కరెంట్, ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, వరస నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాల భర్తీ, కొత్త రేషన్ కార్డులు, తెలుపు రంగు రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ వేగంగా ముందుకెళుతుండగా ఏపీలో మాత్రం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు కాక ప్రజల్లో కొంత అసంతృప్తి అయితే బయలుదేరింది. అయితే ఎవరూ బయటకు చెప్పకపోయినా జగన్ ఉండి ఉంటే తమ అకౌంట్లలో డబ్బులు పడేవన్న భావనలో ఎక్కువ మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుని తమ పరిస్థితికి కారణం పై చర్చించుకుంటున్నారు.
పథకాల అమలుపై...
ఇక ఏపీ ప్రభుత్వం పింఛను ను నాలుగు వేల రూపాయలు నెలకు పెంచినప్పటికీ అనర్హులను తొలగిస్తుండటం కూడా కొంత ఆందోళనకు దారితీస్తుంది. అయితే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ఏప్రిల్, మే మాసాల్లో అమలు చేస్తామని అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటించినా, వీటికి నిధులు కేటాయించినా ప్రజలలో మాత్రం తమకు అందుతాయోలేదోనన్న ఆందోళన వెంటాడుతుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకమే అందరికీ అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ పథకాల్లో ఎవరికి కోత పెడతారో? ఎవరిని అనర్హులుగా చేస్తారో? నన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు. ఇక రైతులకు కూడా గిట్టుబాటు ధర లేదు. అయిన కాడికి అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. మిర్చి, కంది, వరి వంటి వాటికి గిట్టుబాటు ధరలు లేవని అన్నదాతలు మనసులోనే ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఇవన్నీ వైసీపీ నేతలకు వినపడుతున్నాయి. మహిళలకు ఉచితబస్సు పథకం కూడా అమలు చేయలేదు.
ప్రజానాడి తెలిశాక...
అందుకే ప్రజానాడిని ప్రతి రోజూ వింటూ.. కంటున్న వైసీపీ నేతలు తమకు మళ్లీ మంచి రోజులు వస్తాయన్న నమ్మకంతో ముందుకు వస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ బయటకు కూడా రానినేతలు నేడు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగుతున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ టీడీపీ కంటే వైసీపీ ఒక అడుగు ముందేఉందని చెప్పక తప్పదు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజల బాధలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతుండటంతో అవి వైరల్ గామారుతున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు. జగన్ బయటకు రాకముందే ఇలా ఉంటే.. ఇక జనంలోకి రావడం మొదలుపెడితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమన్నవిశ్వాసం వారిలో కనపడుతుంది. అందుకే వైసీపీ నేతలు, క్యాడర్ ఇక రెచ్చిపోయే అవకాశాలుకనిపిస్తున్నాయి.