Chandrababu : నో కాంప్రమైజ్.. చంద్రబాబు ఆలోచనలు మారవు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవిష్యత్ ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవిష్యత్ ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ప్రజలకు మాత్రం ఇన్ స్టెంట్ ప్రయోజనాలు అవసరం అన్నది గుర్తించరు. కుటుంబ ఆదాయాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళితే వారిలో కొనుగోలు శక్తి పెరుగుతుందని, తద్వారా కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటాయన్ని చంద్రబాబు ఆలోచన. కానీ ప్రజలు అందుకు సుముఖంగా ఉండరు. ముఖ్యంగా పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మంది పండగలు, పబ్బాలు వచ్చినప్పుడు మాత్రం చేతిలో డబ్బులు లేక గత ప్రభుత్వంతో పోల్చుకుని తమ పరిస్థితి ఇలా కావడానికి కారణం కూటమి ప్రభుత్వం అని నమ్ముతారు. అసంతృప్తిని సహజంగానే వెళ్లగక్కుతారు.
ఆలోచనలు వేరు...
కానీ చంద్రబాబు ఆలోచనలువేరుగా ఉంటాయి. ఆయన ఒక కుటుంబం దీర్ఘకాలంలో ఉపయోగపడటంపై ఆలోచన చేస్తారు. అందుకే పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రైతులకు సాగునీటికి ఇబ్బంది ఉండదు. గ్రామాల్లో తాగు నీటి కొరత కూడా తీరుతుంది. దీంతో పాటు ఆయన అనుకుంటున్నట్లు గేమ్ ఛేంజర్ గా భావిస్తున్న బనకచర్ల పథకం కూడా పూర్తయితే ఇక ఆంధ్రప్రదేశ్ కు తిరుగుండదు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణం విషయంలోనూ ఆయన ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. ఒక నగరం వస్తున్నప్పుడు అనేక మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. పనులు ఎక్కువయి వారికి కావాల్సిన ఉపాధి దొరకడమే కాకుండా సంపద కూడా పెరిగే అవకాశముందన్నది చంద్రబాబు దూరదృష్టి.
ఎవరి వత్తిళ్లకు...
కానీ సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం లేదని, తమకు ఎప్పుడు నగదు ఇస్తారోనని ప్రశ్నించడం కొందరి ప్రజలకు రివాజుగా మారింది. అయితే చంద్రబాబు రాష్ట్రాన్ని రానున్న పాతిక సంవత్సరాల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై ఆయన అధ్యయనం చేస్తారు. అందుకు తగినట్లు ప్రణాళికను రూపొందించుకుంటారు.అందులో చంద్రబాబు ఎలాంటి వత్తిళ్లకు లొంగరు. తాను అనుకున్నది మాత్రమే చేస్తారు. కాంప్రమైజ్ అనేది కారు. ఎందుకంటే తాను కూడా అప్పుల చేసి పథకాలను గ్రౌండ్ చేయవచ్చు. కానీ ఈ పథకాల ద్వారా వచ్చిన డబ్బులను తాగి తగలేస్తారు తప్పించి వారి కుటుంబాలు బాగుపడవన్నది చంద్రబాబు నాయుడు విధానం కావడంతో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురు కాక తప్పదంటారు.
నివేదికలు అందినా నిబ్బరమే......
చంద్రబాబు నాయుడుకు క్షేత్రస్థాయిలో ప్రజల్లో అసంతృప్తి ఉందని నివేదికలు అందుతాయి. ఆ విషయం ఆయనకు తెలియంది కాదు. అయితే చంద్రబాబు మాత్రం ఆ విషయంలో నిబ్బరంగా ఉంటారు. ఈరోజు గురించి ఆలోచించవద్దని, రేపు, ఎల్లండి గురించి ఆలోచించాలని ఆయన తరచూ చెప్పే మాటలనే కార్యాచరణలో పెడతారు. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా జరగాలని ఆయన అనుకుంటారు. అలాగే చేస్తారు. ప్రజల మనసులను గెలుచుకోవడమెలాగో చంద్రబాబుకు మించి తెలియంది కాదు. అలాగే ఆయనను మించిన రాజకీయ వ్యూహాన్ని రచించే వారు కూడా అరుదుగా ఉంటారు. అందుకే తెలుగు తమ్ముళ్లు ఎంత మంది ఎన్నిపోస్టులు సోషల్ మీడియాలో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడుతున్నా ఆయన లైట్ గానే తీసుకుంటారు.