Chandrababu : బీసీలకు యాభై ఏళ్లకే పింఛన్ ఎప్పటి నుంచి అంటే?.. గుడ్ న్యూస్ చెప్పనున్న చంద్రబాబు సర్కార్
ఐదేళ్ల విరామం అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళుతుంది
ఐదేళ్ల విరామం అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళుతుంది. బాధ్యతలను స్వీకరించిన తొలి రోజే చంద్రబాబు ఐదుఫైళ్లపై సంతకాలు చేశారు. నాలుగు వేల రూపాయలు పింఛను జులై నెల నుంచి అందరికీ మంజూరు చేస్తున్నారు. వచ్చే నెల ఒకటో తేదీన పింఛను 65 లక్షల మందికి ఏడు వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమయింది. జులై నెల నాలుగువేల రూపాయలు, ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి వెయ్యిరూపాయల చొప్పున కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు జులై ఒకటో తేదీ నుంచి పింఛనుదారులకు విడుదల చేయాలని, సచివాలయం సిబ్బంది చేత ఇంటింటికి జులై ఒకటోతేదీన పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికల సందర్భంగా...
అయితే ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇచ్చిన హామీని కూడా త్వరలోనే నెరవేర్చాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎన్నికల మ్యానిఫేస్టోలో యాభై ఏళ్లు నిండిన బీసీలందరికీ నెలకు నాలుగు వేల రూపాయలు పింఛను మంజూరు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికలకు ముందు మంగళగిరలో జరిగిన జయహో బీసీ సభలో కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు. దీంతో పాటు బీసీ ఉప ప్రణాళిక అమలులో భాగంగా సంవత్సరానికి ముప్పయివేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని, ఐదేళ్లలో 1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమయింది.
పార్టీ ఆవిర్భావంనుంచి...
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు ఎక్కువ శాతం ఆ పార్టీ వెంటనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థుల విజయానికి బీసీలు అండగా నిలిచారు. బీసీలు తమ పార్టీకి వెన్నుముక అని చంద్రబాబు అనేక సార్లు ప్రకటించారు. ఈసారి తన మంత్రివర్గంలో ఎనిమిది మంది బీసీలకు స్థానం కల్పించారు. బీసీ ఓటు బ్యాంకును మరింత బలోపేతం చేసుకునే దిశగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదని, బ్యాక్ బోన్ అని చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. యాభై ఏళ్ల వయసు దాటిన బీసీలకు నాలుగు వేల రూపాయల పింఛను ఇచ్చేందుకు ఫైలును సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు తెలిసింది.
దసరా కానుకగా...
అయితే బీసీలు, వయసు నిబంధనతోనే అర్హతగా నిర్ణయించున్నారని తెలిసింది. ఇందుకు సంబంధించి ఆధార్ కార్డులో వయసుతో పాటు బీసీ సర్టిఫికేట్ ను చూసి లబ్దిదారులను ఎంపిక చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి కొంత సమయం పట్టే అవకాశముందని, కొద్ది నెలల్లోనే యాభై ఏళ్లు నిండిన బీసీలందరికీ పింఛను అందించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇది ఎప్పుడు అనే ముహూర్తం నిర్ణయించనప్పటికీ దసరా కానుకగా అందించాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఆర్థిక పరిస్థితిని బీసీలకు యాభై ఏళ్లునిండిన వారికి పింఛను ను మంజూరు చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిజంగా ఇది బీసీలకు గుడ్ న్యూస్ అని చెప్పాలి.