ఏపీలో మండే ఎండలు... తెలంగాణలో తేలికపాటి వర్షాలు

జాతీయ వాతావరణ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో మండే ఎండలు, ఉక్కపోత వేసవిని తలపిస్తోంది.

Update: 2023-08-30 03:59 GMT

ఏపీలో మండే ఎండలు...

తెలంగాణలో తేలికపాటి వర్షాలు

జాతీయ వాతావరణ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో మండే ఎండలు, ఉక్కపోత వేసవిని తలపిస్తోంది. వారు విడుదల చేసిన చిత్రాల్లో ఈ రెండు రాష్ట్రాల్లోనూ మేఘాలు లేవు. అయితే నేడు (మంగళవారం) అరేబియా నుంచి చిన్న మేఘాలు తెలంగాణాకు రానున్నాయి. దీంతో చిరు జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీకి ఎటు నుంచి మేఘాలు వచ్చే అవకాశం లేనందున భారీ ఎండలు, ఉక్కపోత ఉంటాయని వివరించింది. నేడు, రేపు కోస్తా, యానాం, రాయలసీమల్లో వేడి వాతావరణం ఉంటుందని, ఉత్తరాంధ్ర తప్ప మిగతా ఏపీ అంతా ఉక్కపోత వాతావరణం ఉంటుందని, వానలు రాబోవని తేల్చి చెప్పింది.

ఈ సమయానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవాలి. కానీ అరేబియా సముద్రం మనకు వానలు పడకుండా అడ్డుకుంటోంది. ఆసియా నుంచి వచ్చే మేఘాలను, అరేబియా నుంచి వస్తున్న బలమైన గాలులు అడ్డుకొని, చెల్లాచెదురు చేస్తున్నాయి. దాంతో.. ఆ మేఘాలు అటు వైపు వెళ్లిపోతున్నాయి.

ప్రస్తుతం బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఉంది. అందులో వర్షాలు కురిపించే మేఘాలు బోలెడున్నాయి. కానీ అవి మన తెలుగు రాష్ట్రాలవైపు రాలేకపోతున్నాయి. రెండ్రోజులుగా ఇదే పరిస్థితి. ఆ మేఘాలతో మనకు వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ కూడా చెప్పడం లేదు. అందువల్ల మనం వాటిపై ఆశ పెట్టుకునే పరిస్థితి కనిపించట్లేదు. మొత్తంగా ఈ ఆగస్టు నెల మొదట్లో వానలు చూశాం. ఆ తర్వాత చెప్పుకునేంత వర్షాలు లేవు.

వాతావరణ శాఖ అంచనా ప్రకారం నైరుతీ రుతుపవనాలు హిమామలయాల చెంత తిరుగుతున్నాయి. వచ్చే 5 రోజులూ అక్కడే ఉండటం వల్ల సెప్టెంబర్ 2 నుంచి.. తిరుగు మొఖం పట్టి, అంటే.. ఈశాన్య రుతుపవనాలు దక్షిణం వైపు రావడం సెప్టెంబర్ 2 నుంచి మొదలయ్యే అవకాశం ఉంది.

ఇక తూర్పు ఆసియాలో ఉన్న అతి తీవ్ర తుపాను సవోలా (Saola) మరింత బలపడింది. అక్కడ గంటకు 230 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అది హింసాత్మక తుపాను అని అంటున్నారు. అది క్రమంగా హాంకాంగ్ వైపు వెళ్తోంది. ఆదివారానికి అది తీరం దాటుతుందనే అంచనా ఉంది. ప్రస్తుతం ఫిలిప్పీన్స్, హాంకాంగ్, థాయిలాండ్ సహా తూర్పు ఆసియా దేశాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Tags:    

Similar News