Andhra Pradesh : ఈరోజు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... రెడీ అయిపోయారుగా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు ఐదు రోజుల పాటు జరిగే అవకాశాలున్నాయి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు ఐదు రోజుల పాటు జరిగే అవకాశాలున్నాయి. ఈ నెలాఖరుతో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ముగియనుండటంతో మరో మూడు మూడు నెలలకు ఓట్ ఆన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈరోజు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. తర్వాత గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. సభలో దీనిపై చర్చిస్తారు.
వస్తారా? రారా?
అయితే జగన్ ఈ సమావేశాలకు వస్తారా? లేదా? అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత డీలా పడిన వైసీపీ చీఫ్ పదకొండు సీట్లు మాత్రమే రావడంతో ఆయనను సాధారణ సభ్యుడిగానే చూస్తారంటున్నారు. అది ఇష‌్టం లేని జగన్ నేడు అసెంబ్లీ సమావేశాలకు వస్తారా? లేదా? అన్నది మాత్రం సస్పెన్స్ గా కొనసాగనుంది. అయితే మిగిలిన సభ్యులు మాత్రం సభకు హాజరై అధికార పార్టీని నిలదీయాలని నిర్ణయించారు. ప్రధానంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై అధికార పక్షాన్ని నిలదీయాలని నిర్ణయించారు. ఈ నెల 24 ఢిల్లీలో ధర్నా ఉండటంతో ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరై వాకౌట్ చేసి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ధీటుగా సమాధానం చెప్పేందుకు...
దీంతో పాటు రాష్ట్రంలో అదుపుతప్పిన శాంతిభద్రతలు, దాడులు, కూల్చివేతల వంటి అంశాలపై కూడా వైసీపీ ఎమ్మెల్యేలు నిలదీయాని డిసైడ్ అయ్యారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే నిరసన తెలపాలని వైసీీపీ నిర్ణయించింది. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని సభ నుంచి బయటకు వెళ్లాలన్న ఆలోచనలో వైసీపీ ఉంది. అయితే వైసీపీ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతామని అధికార పార్టీ చెబుతుంది. తాము ఎక్కడెక్కడ ఎవరు హత్యకు గురయింది? అందులో టీడీపీ నేతలు ఎందరున్నారు? అనే విషయాలపై చర్చకు సిద్ధమని అధికార పక్షం సవాల్ విసురుతుంది. మరోవైపు ఆర్థిక పరిస్థితులు, శాంతి భద్రతల పరిస్థితులపై అసెంబ్లీ వేదికగా శ్వేత పత్రాలను కూడా ఈ సమాశాల్లో విడుదల చేసే అవకాశముంది.