నేటితో ప్రచారానికి తెర.. మెజారిటీపైనే?
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైసీపీ తరుపున దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి ఉండగా, బీజేపీ తన అభ్యర్థిని బరిలోకి దింపింది. మరో 11 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి నేడు తెరపడనుంది. ఈ నెల 23వ తేదీన ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నిక జరగనుంది.
ప్రధాన పార్టీలూ...
ఈ ఎన్నికకు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, జనసేన పార్టీలు దూరంగా ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించడం, వారి కుటుంబ సభ్యులకే టిక్కెట్లు ఇవ్వడంతో ఈ పార్టీలు పోటీ చేయడం లేదు. దీంతో పోటీ ఏకపక్షంగా మారనుంది. కాంగ్రెస్ కూడా ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. బీజేపీ మాత్రం తన అభ్యర్థిని బరిలోకి దింపింది. చిన్నా చితకా పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు.
మండలానికి ఒక మంత్రి....
వైసీపీ మండలాల వారీగా మంత్రులను ఇన్ ఛార్జులను నియమించింది. ఒక్కొక్క మండలానికి మంత్రి, ఎమ్మెల్యే ఇన్ ఛార్జులుగా వ్యవహరిస్తున్నారు. వీరంతా ప్రచారంలో ముందంజలో ఉన్నారు. జగన్ ఈరోజు ఆత్మకూరు ప్రజలను ఉద్దేశించి లేఖ రాసే అవకాశముంది. ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నారు. బీజేపీ కూడా కేంద్ర మంత్రులను రంగంలోకి దించింది. జతీయ నేతలు ప్రచారం చేశారు. ఇక్కడ వైైసీపీ గెలుపు ముందుగానే ఖరారయినా మెజారిటీ ఎంతన్నదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్ లక్షకు పైగా మెజారిటీ రావాలని టార్గెట్ పెట్టారు.