Ys Jagan : జగనన్నా...! అనుభవించు... నెత్తిన పెట్టుకున్నావుగా... ఇప్పుడు సున్నం పెడుతున్నా ఏం చేయలేవుగా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాను అధికారంలో ఉన్నప్పుడు వాడిన బీసీ కార్డే ఇప్పుడు రివర్స్ అయింది.

Update: 2024-09-25 06:06 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాను అధికారంలో ఉన్నప్పుడు వాడిన కార్డే ఇప్పుడు రివర్స్ అయింది. బీసీలే ఆయనను వదిలేసి వెళ్లిపోతున్నారు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు బీసీ మంత్రం ఎక్కువగా వాడారు. ప్రతి బహిరంగ సభలో ఆయన నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ ప్రసంగాన్ని ప్రారంభించేవారు. అలాగే బీసీలకు కూడా తన పాలనలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మంత్రిపదవుల్లోనూ, నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ, ఇటు రాజ్యసభ పదవిలోనూ బీసీలనే ఎక్కువగా నియమించిన వైఎస్ జగన్ తాను బీసీ కార్డుతో చంద్రబాబును దెబ్బతీయవచ్చని అంచనా వేశారు. కానీ గత ఎన్నికల్లో బీసీ ఓటర్లు పెద్దగా జగన్ వైపు మొగ్గు చూపలేదన్నది గణాంకాలు చెబుతున్నాయి.

బ్యాక్‌గ్రౌండ్ తెలిసీ...
తాజాగా రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. బీసీ లీడర్ అని చెప్పి తెలంగాణకు చెందిన ఆర్. కృష్ణయ్యను ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్ రాజ్యసభకు ఎంపిక చేశారు. ఆర్. కృష్ణయ్య బ్యాక్ గ్రౌండ్ తెలిసి కూడా జగన్ పప్పులో కాలేశాడని అప్పుడే వైసీపీ నేతలు కొందరు అన్నారు. కానీ జగన్ ఇవేమీ పట్టించుకోలేదు. ఆర్. కృష్ణయ్య బీసీ లీడర్ గా ఎదగడానికి ముందు ఏబీవీపీ లీడర్ గా పనిచేశారు. ఆర్ఎస్‌ఎస్‌తో అనుబంధం ఉంది. బీజేపీతో సత్సంబంధాలున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితుడు మరోవైపు ఆయన గతం పరిశీలిస్తే టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ ఆయనను తెలంగాణకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి గతంలో ఎన్నికలకు వెళ్లిందని కూడా జగన్ కు తెలుసు. అన్నీ తెలిసి జగన్ ఆర్. కృష్ణయ్యను ఏరికోరి తెలంగాణ నుంచి తెచ్చుకుని మరీ నెత్తిమీద పెట్టుకున్నారు.
నాడే వ్యతిరేకత...
నాడే ఆర్. కృష్ణయ్య ఎంపికపై ఏపీలోని బీసీ సంఘాల నేతల నుంచి కొంత వ్యతిరేకత ఎదురయింది. అయినా సరే జగన్ ఎవరి మాట వినరు కదా? ఎందుకంటే జగన్ ది అంతే వన్ వే రూట్. ఎవరు ఎంత చెబుతున్నప్పటికీ జగన్ వింటేగా? ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పదు. ఆర్. కృష్ణయ్య వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది? ఆయన నిలకడలేమి మనస్తత్వం అన్న విషయాలు తెలిసి కూడా జగన్ ఒక కీలకమైన పదవిని పార్టీ నేతలకు కూడా ఇతరులకు అప్పగించి తప్పు చేశారని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ కు ఇప్పుడు తెలిసి వచ్చినా లాభం లేదని, నష్టం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు చింతించి లాభమేమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
ఎనిమిదికి పడిపోయి...
వైసీపీ ఓటమి పాలయ్యేనాటికి రాజ్యసభలో పదకొండు మంది సభ్యుల బలం ఉంది. అయితే ఇప్పటి వరకూ ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేశారు. దీంతో వైసీపీ బలం పెద్దల సభలో ఎనిమిదికి పడిపోయింది. అదేం విచిత్రమో కాని రాజీనామా చేసిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీసీ సామాజికవర్గానికి చెందిన వారే. మోపిదేవి వెంకటరమణ, బీద రవిచంద్ర యాదవ్, ఇప్పుడు ఆర్. కృష్ణయ్య ఇలా ముగ్గురు జగన్ తాను అనుకున్న వారికి టిక్కెట్లు ఇచ్చినా వారు జెల్ల కొట్టి వెళ్లిపోవడం ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు రాజ్యసభ పదవి ఏ ఒక్కటి ఖాళీ అయినా అది వైసీపీకి దక్కదు. కూటమికే చెందుతుంది. బలం లేకపోవడంతో ఇక చూస్తూ ఊరుకోవాల్సిందే. ఆర్.కృష్ణయ్య రాజ్యసభ పదవీ కాలం ఇంకా నాలుగేళ్లుఉంది. 2022లో ఆయన రాజ్యసభ పదవికి ఎంపికయ్యారు. ఇలా జగన్ తాను నమ్మిన వారే నట్టేట ముంచి వెళుతున్నా గుడ్లప్పగించి చూస్తుండటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి జగన్ ది.. పూర్ లీడర్.


Tags:    

Similar News