Ap Elections : నలుగురు అధికారుల సస్పెన్షన్.. విచారణ.. పల్నాడు, సీమల్లో చెలరేగిన హింసపై ఈసీ సీరియస్
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ అనంతరం జరిగిన హింసపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది.
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ అనంతరం జరిగిన హింసపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఘర్షణలకు తలెత్తిడినా వాటిని నివారించడంలో విఫలమయిన అధికారులపై వేటు వేసింది. వీరిలో ముగ్గురు ఎస్పీలు, ఒక కలెక్టర్ ఉన్నారు. పల్నాడు కలెక్టర్ శివశంకర్ ను బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఘటనలను సకాలంలో నివారించలేకపోయిన పల్నాడు ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
16 మంది పోలీసు అధికారులను...
వీరితో పాటు ఘర్షణలకు సహకరించిన పన్నెండు మంది కిందిస్థాయి పోలీసు అధికారులపై కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసింది. వీరిపై శాఖపరమైన విచారణ జరపాలని ఆదేశించింది. ఈరోజు సాయంత్రంలోగా వారిపై ఛార్జిషీట్ నమోదు చేయాలని ఆదేశించింది. రెండు నెలల్లో విచారణ పూర్తి చేసి తమకు సమగ్ర నివేదిక అందచేయాలని తెలిపింది. తమ అనుమతి లేకుండా వీరిపై సస్పెన్షన్లను ఎత్తివేయడం కానీ, శాఖాపరమైన చర్యలను నిలిపివేయడం కానీ చేయకూడదని స్పష‌్టమైన ఆదేశాలు జారీ చేసింది.
వీరి స్థానంలో...
వేటు పడిన అధికారుల స్థానంలో ఈ నెల 17వ తేదీ ఉదయం 11 గంటలోగా అధికారుల పేర్ల జాబితాను తమకు పంపాలని కోరింది. ఫలితాల తర్వాత కూడా హింస చెలరేగే అవకాశమున్నందున ఇరవై ఐదు కంపెనీల కేంద్ర బలగాలను, జూన్ నాలుగో తేదీ తర్వాత మరో రెండు వారాలు కొనసాగించాలని పేర్కొంది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినా ముందుగా అక్కడ ఘర్షణలు జరుగుతాయని తెలిసినా నివారించడంలో విఫలమైన వారిపై చర్యలు తప్పవని కేంద్ర ఎన్నికల సంఘం ఈ చర్యల ద్వారా హెచ్చరించినట్లయింది.