Volunteer Jobs:వాలంటీర్ ఉద్యోగాలు.. చంద్రబాబు నాయుడు చెబుతోంది ఇదే!!
ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం వస్తే వాలంటీర్ల ఉద్యోగాలు పోతాయనే అనుమానాలు కూడా
Volunteer Jobs:ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవస్థపై గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. వాలంటీర్లు దారుణాలకు తెగబడుతూ ఉన్నారని ఆరోపించారు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం వస్తే వాలంటీర్ల ఉద్యోగాలు పోతాయనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ విషయంపై చంద్రబాబు నాయుడు ఓ క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చాక కూడా ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని,ఎవరి ఉద్యోగం తొలగించబోమని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయవద్దని కోరారు. టీడీపీ ఐఐటీ ఉద్యోగాలు ఇస్తే వైసీపీ కేవలం వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజవర్గంలో టీడీపీ 'రా.. కదలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలంతా అంటున్నారని.. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని.. టీడీపీతో వైసీపీకి పోలికే లేదని అన్నారు చంద్రబాబు. రాష్ట్రాన్ని కాపాడేందుకు టీడీపీ జనసేన కలిసిందని, తమ స్వార్ధం కోసం కాదని అన్నారు. హత్యలకు పాల్పడే వ్యక్తులు ముఖ్యమంత్రి పదవికి అర్హులు కారని అన్నారు. రాజకీయ రౌడిలకు బుద్ధి చెప్పిన పార్టీ టీడీపీ అని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని తెలిపారు.