లోకల్.. నేషనల్.. ఇంటర్నేషనల్ ఇల్లాళ్లు.. పవన్ పై సెటైర్లు
టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మండి పడ్డారు. సామర్లకోటలో జరిగిన బహిరంగ సభో ఆయన మాట్లాడారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మండి పడ్డారు. సామర్లకోటలో జరిగిన బహిరంగ సభో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కుప్పం నియోజకవర్గంలో పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదన్నారు. ఆయన దోచుకోవడానికే సమయం వెచ్చించారని అన్నారు. చంద్రబాబుకు సొంతిల్లు పొరుగు రాష్ట్రమైన హైదరాబాద్‌లో ఉందని తెలిపారు. చంద్రబాబు ఎప్పుడైనా జనంలో నెలరోజులు వరసగా కనపించారా? ఇప్పుడు మాత్రమే రాజమండ్రిలోనే కనిపించారని జగన్ అన్నారు. ఆయనను కాదని, ఆయనను సమర్థించేవారికి గాని ఏపీ పై ప్రేమ ఉందా? అని ప్రశ్నించారు. వీళ్లెవరూ మన రాష్ట్రంలో ఉండరని, కానీ ఏపీ రాజకీయాలు మాత్రం కావాలని కోరుకుంటారన్నారు.
ముగ్గురు పెళ్లాలు...
గజదొంగల ముఠాలో భాగస్వామ్యులు కూడా ఈ రాష్ట్రంలో ఉండరని అన్నారు. వీళ్లందరికీ ఏపీ రాష్ట్ర ప్రజలు ఎందుకు కావాలని అంటే ఇక్కడి డబ్బును దోచుకోవడానికేనని అన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు శాశ్వతంగా ఇల్లు హైదరాబాద్‌లోనే, కానీ ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడు సంవత్సరాలు, నాలుగు సంవత్సరాలకు మారిపోతుంటారన్నారు. ఒకసారి లోకల్, మరొకసారి నేషనల్, ఇంకోసారి ఇంటర్నేషనల్ అంటూ ఈసారి ఎక్కడికి వెళతాడో అని ఎద్దేవా చేశారు.భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం చేతకాని వాళ్లు నాయకులుగా జనం ముందుకు వస్తున్నారన్నారు. సరుకులును, సరంజామా అమ్ముకునే వాళ్లను చూశాం కాని సొంత పార్టీనే అమ్ముకునే వారిని ఇప్పుడే చూస్తున్నామన్నారు. రెండు షూటింగ్ లు చేసుకుని అప్పుడో, ఇప్పుడో వచ్చి పోతారని, అలాంటి వారికి మన రాష్ట్రంపై ఎంత ప్రేమ ఉంటుందో తెలుసుకోవాలని కోరుతున్నానని అన్నారు.
ఫ్యూజలు ఎగిరిపోయాయి...
వీరంతా ప్రజలు అధికారం ఇవ్వలేదని చెప్పి వీరి ఫ్యూజులు ఎగిరిపోయాయని అన్నారు. ఆదాయాలు పోయాయి కాబట్టి వీరందరికీ జనం బాధలను పట్టదన్నారు. ప్యాకేజీ స్టార్‌కు తాను ఓడిపోయిన భీమవరం, గాజువాకతో కూడా సంబంధం లేదన్నారు. తన అభిమానులఓట్లను హోల్ సేల్ గా అమ్ముకునేందుకే పార్టీ పెట్టారని పవన్ కల్యాణ్ పై జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇంగ్లీష్ మీడియం వద్దంటారని, ఇంటి స్థలాలు ఇస్తుంటే కోర్టులకెక్కుతారని జగన్ అన్నారు. పేద ప్రజల బాధలు వీరికి పట్టవని అన్నారు. రాజకీయాలంటే విలువలు ఉండాలని జగన్ అన్నారు. విశ్వసనీయత లేకుండా ఉండేవాళ్లను నమ్మవద్దని పిలుపు నిచ్చారు. 52 నెలల్లో తమ ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసునని అన్నారు. 99 శాతం మ్యానిఫేస్టోలో అమలు చేశామని తెలిపారు.