Ys Jagan : అందుకే ఈ పథకాన్ని తీసుకొచ్చాం
చిరు వ్యాపారులకు అండగా ఉండాలన్న భావనతోనే తాము ఈ పథకాన్ని తీసుకు వచ్చామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు
చిరు వ్యాపారులకు అండగా ఉండాలన్న భావనతోనే తాము ఈ పథకాన్ని తీసుకు వచ్చామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆయన జగనన్న తోడు పథకం కింద లబ్దిదారులకు బటన్ నొక్కి సాయం అందచేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చిరు వ్యాపారులు వడ్డీ వ్యాపారుల బారిన పడి తమ ఆస్తులను పోగొట్టుకున్నారని, తన పాదయాత్రలో ఆ విషయాన్ని తెలుసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని తీసుకు వచ్చామని తెలిపారు. ఈ పథకం వల్ల చిరు వ్యాపారులు అధిక వడ్డీకి వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పనిలేదని, అందువల్ల వారి కుటుంబాలు బాగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా...
మొత్తం 418 కోట్ల రూపాయల నగదును జగన్ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకం కింద ఎనిమిదో విడతలో 3.95 లక్షల మంది లబ్దిదారులు ప్రయోజనం పొందారని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. దీంతో పాటు వడ్డీ రీఎంబర్స్‌మెంట్ నిధులను కూడా జగన్ జమ చేశారు. 5.81 లక్షల మంది లబ్దిదారులకు 13.64 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో బటన్ నొక్కి జమ చేశారు. ఇప్పటి వరకూ ఎనిమిది విడతలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, సక్రమంగా రుణాలు చెల్లించిన వారికి అదనంగా ఏడాదికి వెయ్యి రూపాయలు పెంచి పదమూడు వేల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. వ్యాపారులు తమ ఆదాయాన్ని పెంచుకుని, తద్వారా కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు.