చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ అభిమానుల కీలక సమావేశం
ఏపీలోని అన్ని జిల్లాల నుంచి పరిమిత సంఖ్యలో మెగా అభిమానులు పాల్గొన్నారు.
విజయవాడలో చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ అభిమానులు కీలక సమావేశం నిర్వహించారు. మురళీ ఫార్చున్ హోటల్ లో జరుగుతోన్న ఈ సమావేశంలో ఏపీలోని అన్ని జిల్లాల నుంచి పరిమిత సంఖ్యలో మెగా అభిమానులు పాల్గొన్నారు. జనసేన పార్టీకి మద్దతుగా నిలిచే అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఏపీలో ముగ్గురు హీరోల అభిమానులు కలిసి సంయుక్తంగా పనిచేసి, జనసేన పార్టీని బలోపేతం చేయడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అంశాలపై చర్చించి, ప్రణాళిక వేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన ఇకపై తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటాలని భావిస్తూ ఉంది. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కాస్త బలం పుంజుకున్నట్లు కనిపిస్తున్నా.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పెద్దగా ప్రభావం చూపించింది లేదు. జనసేన రెండు రాష్ట్రాల్లో సత్తా చూపాలంటే మెగా అభిమానులంతా కలిసి రావాల్సి ఉంటుంది. కొందరు అభిమానులు సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ సూపర్ అని చెబుతున్నారు కానీ.. పాలిటిక్స్ విషయంలో మాత్రం వేరే దారి పడుతున్నారు. వారందరినీ కలుపుకుని వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు జనసేన నాయకులు. అందులో భాగంగానే విజయవాడలో అభిమానుల మధ్య కీలక మీటింగ్ జరిగింది. మురళీ ఫార్చున్ హోటల్ లో జరుగుతోన్న ఈ సమావేశంలో ముఖ్యమైన మెగా అభిమానులు పాల్గొన్నారు. జనసేన పార్టీకి మద్దతుగా నిలిచే అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ భేటీకి సంబంధించిన సమాచారం అందాల్సి ఉంది.
మరోవైపు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు ప్రయత్నిస్తున్నారు జనసేన అధినేత. ఇప్పుడు తమ మిత్రపక్షం బీజేపీయే బలహీనతగా మారిపోయింది. ఇప్పుడు బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాలా వద్దా అని ఓవైపు, బీజేపీ,టీడీపీతో కలిసి ఓ ఉమ్మడి విపక్షాన్ని ఏర్పాటు చేయాలని కూడా పవన్ ఆలోచనలు ఉన్నాయి. టీడీపీతో కలిసేందుకు బీజేపీ సిద్ధంగా లేకపోవడంతో ఆ పార్టీని ఒప్పించేందుకు పవన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం.