చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే పోలవరానికి ఈ గతి : సీఎం జగన్
విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు వల్లే ప్రాజెక్టుకు ఇన్ని కష్టాలొచ్చాయని ఆరోపించారు. అప్పటి ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి..
అమరావతి : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మాజీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో పోలవరం గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు పోలవరంపై అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు వల్లే ప్రాజెక్టుకు ఇన్ని కష్టాలొచ్చాయని ఆరోపించారు. అప్పటి ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టును తమ చేతుల్లోకి తీసుకుందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తున్నామని చంద్రబాబు ఎవరు చెప్పారని ప్రశ్నించారు.
ప్రధాని మోదీ ఏమైనా ప్రాజెక్టు గురించి వారితో మాట్లాడారా ? అని ప్రశ్నించారు. ప్రాజెక్టు ఎత్తుపై ఉన్నవీ లేనివన్నీ కలిపి ఎల్లో మీడియా దుష్ప్రచారానికి పాల్పడిందని దుయ్యబట్టారు. 2013-14 అంచనాల ప్రకారమే ప్రాజెక్టును కడతామని చెప్పారు. స్పిల్ వే పూర్తి చేయకుండానే కాఫర్ డ్యామ్ కట్టారని, మధ్యలో మూడు పెద్ద ఖాళీలను వదిలిపెట్టారని జగన్ విమర్శించారు. పునాదిపైన, లోపల కలిపి 35.6 మీటర్ల మేర గుంత ఏర్పడిందని తెలిపారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే పోలవరం నిర్మాణంలో జాప్యం జరిగిందన్న జగన్.. అన్ని సమస్యలను అధిగమించి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు.