Tirumala : తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు సాధారణంగానే ఉంది. పెద్దగా రష్ లేదు

Update: 2024-10-24 03:32 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు సాధారణంగానే ఉంది. పెద్దగా రష్ లేదు. గురువారం కావడంతో భక్తుల సంఖ్య అంతగా లేదు. అదే సమయంలో తుపాను హెచ్చరికలు కూడా భక్తుల రాకను తిరుమలకు తగ్గించేశాయి. దీంతో పెద్దగా కష్టపడకుండానే, ఎక్కువ సమయం వేచి ఉండకుండానే శ్రీవారి దర్శనం భక్తులు చేసుకుంటున్నారు. గత కొద్ది రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. దాదాపు రెండు వందల రైలు సర్వీసులు రద్దు కావడం కూడా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడానికి ఒక కారణంగా చెబుతున్నారు. తుపాను తీవ్రత ఎలా ఉంటుందో తెలియని భక్తులు ముందుగా బుక్ చేసుకున్న వారు కూడా వాయిదా వేసుకున్నారని తెలిసింది. ఈరోజు రాత్రికి తుపాను తీరం దాటనుందన్న వార్తలతో ప్రజలు భయపడి తిరుమలకు చేరుకోవడం తగ్గిందని తెలిపారు. చుట్టు పక్కల జిల్లాల నుంచి మాత్రమే ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం జనవరి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జనవరి నెలలో సంక్రాంతి సెలవులు ఉంటాయి కాబట్టి ఆన్ లైన్ లో పెట్టిన వెంటనే టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఏడు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూలైన్ లోకి ఈరోజు ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 64,447 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిో 25,555 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.38 కోట్ల రూపాయలు వచ్చింది.


Tags:    

Similar News