Tirumala : తిరుమలతో తగ్గిన భక్తుల రద్దీ... నేరుగా నేడు శ్రీవారి దర్శనం

తిరుమలలో నేడు భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు

Update: 2024-11-27 03:08 GMT

తిరుమలలో నేడు భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఏపీకి భారీ వర్ష సూచనతో పాటు వాయుగుండంతో పాటు తుపాను హెచ్చరికలు జారీ చేయడంతో రైళ్లు, బస్సులు రద్దవుతాయని భావించిన భక్తులు తిరుమల పర్యటనను వాయిదా వేసుకున్నట్లు కనిపిస్తుంది. ఈ నెల 29వ తేదీ నుంచి తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఏపీలో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికతో భక్తులు తక్కువ మంది తిరుమలకు చేరుకున్నారు. ముందుగా దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు సయితం తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారని తెలిసింది సమీప ప్రాంతాల ప్రజలు మాత్రమే తిరుమలకు వచ్చి ఏడుకొండలవాడిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, తుపాను హెచ్చరికల నేపథ్యంలోనే తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిందని అధికారులు తెలిపారు.

వేచి ఉండకుండానే...
అయితే ప్రతి శుక్ర, శని, ఆదివారాలు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ వారం మాత్రం ఈ మూడు రోజులు కూడా భక్తుల రద్దీ పెద్దగా ఉండదని అధికారులు ముందుగానే అంచనా వేస్తున్నారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన సయితం తుపాను కారణంగా రద్దయింది. దీంతో తిరుమలకు భక్తులు అత్యల్ప సంఖ్యలో వస్తున్నారు. నేడు తిరుమల వైకుంఠం కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండకుండానే దర్శనం చేసుకుంటున్నారు. నేరుగా దర్శనం భక్తులకు లభిస్తుంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 64,525 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 19,880 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News