Pawan Kalyan : వైసీపీ నేతలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో ఆలయంలో అన్ని తప్పులే జరిగాయన్నారు. విజయవాడ కనకదుర్గ గుడిలో మెట్లను శుభ్రం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలు సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. పొన్నవోలు మాట్లాడిన తీరు బాధాకరమని పవన్ కల్యాణ్ అన్నారు. సనాతన ధర్మాన్ని హేళన చేస్తే మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
సనాతన ధర్మం జోలికి వస్తే...?
ఎవరైనా పొగరుగా మాట్లాడితే ఊరుకోబోమన్నారు. తప్పు జరిగితే ఒప్పుకోవాలని, లేకుంటే తమకు సంబంధం లేదని చెప్పాలని పవన్ కల్యాణ్ అన్నారు. సున్నిత అంశాలపై మాట్లాడి మనోభావాలను దెబ్బతీయవద్దంటూ ఆయన వైసీపీ నేతలను కోరారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని అన్ని నివేదికలు చెబుతున్నాయని అన్నారు. అందుకే తాను ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టానని అన్నారు. తన ప్రాయశ్చిత దీక్షతోనైనా వైసీపీ నేతలు మనసులు మారతాయని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ అభిప్రాయపడ్డారు. గతంలోనే తాను ఆలయాల్లో తప్పులు జరుగుతున్నాయని చెప్పానని, అప్పుడు కూడా తనను అపహాస్యం చేసిన విషయాన్ని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. అపవిత్రం జరిగినప్పుడు బాధ్యత ఉన్న వ్యక్తులు సమాధానం చెబితే బాగుంటుందని పవన్ అన్నారు.