జగన్ తో బాలినేని భేటీ
సమన్వయకర్త పదవికి రాజీనామా ప్రకటించాక సీఎంవో పిలుపు మేరకు తాడేపల్లి ప్యాలెస్‌లో ఐప్యాక్ ప్రతినిధులతో పాటు,
మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి మళ్లీ పిలుపొచ్చింది. మంత్రి వర్గ విస్తరణలో మంత్రి పదవి కోల్పోయినప్పటి నుండి బాలినేని వైసీపీ అధిష్టానంతో కొంచెం అంటీ ముట్టనట్లు ఉన్నారు. మార్కాపురంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈబీసీ నేస్తం పథకం ప్రారంభానికి వచ్చిన సందర్భంగా కూడా బాలినేనికి సరైన గౌరవం దక్కలేదనే ప్రచారం సాగింది. ఈ పరిణామాలతో బాలినేని కలత చెందారు. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల వైకాపా సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. కొద్దిరోజుల తర్వాత ఒంగోలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. తాను టికెట్లు ఇప్పించిన వారితోనే తనపై సీఎంకు ఫిర్యాదులు చేయిస్తున్నారని అన్నారు.
సమన్వయకర్త పదవికి రాజీనామా ప్రకటించాక సీఎంవో పిలుపు మేరకు తాడేపల్లి ప్యాలెస్‌లో ఐప్యాక్ ప్రతినిధులతో పాటు, సీఎంతో ముఖాముఖి సమావేశమయ్యారు. పార్టీ సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తూ ప్రకటించిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం కోరారు. భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లారు. ఇప్పుడు మరోసారి సీఎం జగన్ నుంచి పిలుపొచ్చింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి రావాల్సిందిగా సీఎం కార్యాలయం నుంచి సమాచారం అందినట్టు తెలిసింది. సీఎంతో భేటీకి బాలినేని సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు కూడా తీవ్ర స్థాయికి చేరిందని అంటున్నారు. ఫ్లెక్సీల్లో కూడా వర్గ పోరు తారా స్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఈ విషయం సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో బాలినేని శ్రీనివాసరెడ్డికి నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు.