పవన్ పొలిటికల్ ప్యారెట్.. పేర్ని నాని ఫైర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఒకాయన పొలిటికల్ ఆక్టోపస్ గా ఉండేవారని, ఇప్పుడు పవన్ పొలిటికల్ ప్యారెట్ గా మారారన్నారు. వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పిన పవన్, ఆయన ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో మాత్రం చెప్పలేకపోయారన్నారు. నీ చిలుక ఏం జోస్యం చెప్పిందని పేర్ని నాని ప్రశ్నించారు. సొంత మామకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు అయితే, సొంత అన్నకు వెన్ను పోటు పొడిచింది పవన్ అని అన్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఓడిపోయాక అసలు నువ్వు కనిపించావా? అని నిలదీశారు.
పావలా శిక్ష....
2014లో తాను టీడీపీకి మద్దతిచ్చిన పవన్ ఆ ఐదేళ్లు జరిగిన తప్పులకు పావలా శిక్ష పవన్ దేనని పేర్ని నాని సెటైర్ వేశారు. యాత్ర పేరుతో ముంచాలనుకున్నది జనసైనికులనా? సినీ ప్రొడ్యూసర్లనా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు యాత్రకు పర్మిషన్ ఇవ్వలేదేమో అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా కనపడని తప్పులు జగన్ పాలనలో మాత్రం వీకెండ్ వచ్చి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. చిరంజీవి మీద బురదచల్లే ప్రయత్నం మానుకోవాలని పవన్ కు హితవు పలికారు. చిరంజీవి తన పార్టీ గెలుపుకోసం అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేశారని, ఆ ధైర్యం నీకుందా? అని పవన్ ను ప్రశ్నించారు.
హైదరాబాద్ ను వదిలేసి....
2014లో రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్ ను వదిలి పెట్టింది చంద్రబాబు కాదా? అని పేర్ని నాని ప్రశ్నించారు. పదేళ్లపాటు రాజధాని అవకాశం ఉన్నా వదులుకుని వచ్చింది ఎవరని పేర్ని నాని నిలదీశారు. హైదరాబాద్ లో ఉన్న మన ఆస్తులను వదిలేసి మీ పార్టనర్, బాస్ ఏపీకి వచ్చింది నిజం కాదా? అని నిలదీశారు. జగన్ మీద పడి ఎంతసేపూ పడి ఏడవడం నీ రాజకీయమా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క మాట అయినా ఎప్పుడైనా మాట్లాడలేని నువ్వు జగన్ ప్రశ్నించే అర్హత లేదని పేర్ని నేని అన్నారు. పవన్ వల్ల జనసేన నాయకులు, కార్యకర్తలు అన్ని రకాలుగా నష్టపోయారన్నారు