Ys Jagan : జగన్ అసెంబ్లీకి వస్తారా.. జనం బాట పడతారా? కేసీఆర్ చూపిన మార్గమేనా?

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారింది. ఈ నెల 19 వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని చెబుతున్నారు

Update: 2024-06-14 04:34 GMT

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారింది. ఈ నెల 19 వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని చెబుతున్నారు. అయితే ఈ సమావేశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు రద్దును ఆమోదించడంతో పాటుగా మరికొన్ని కీలక బిల్లులను ఆమోదించడానికి అవకాశముంది. దీంతోపాటు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నికయిన శాసనసభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. స్పీకర్ ఎన్నిక ఉంటుందని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? అన్న దానిపై అనేక అనుమానాలున్నాయి.

ఓటమి తర్వాత...
ఎందుకంటే ఎన్నికలలో దారుణ ఓటమి తర్వాత జరిగే తొలి సమావేశాలకు దూరంగా ఉండేందుకే జగన్ నిర్ణయంచుకున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ ఎన్నికల్లో కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలవడంతో శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చే అవకాశం లేదు. దీంతో ప్రస్తుతసమావేశాలకు దూరంగా ఉండటమే బెటర్ అని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. సమావేశాలకు వెళ్లడం కంటే జనంలోకి వెళ్లడమే మంచిదని ఆయన నిర్ణయానికి వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణల్లో మృతి చెందిన, గాయపడిన వారిని పరామర్శించేందుకు జగన్ జనంలోకి వెళతారని చెబుతున్నారు.
కేసీఆర్ తరహాలో...
ఇక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నా తర్వాత చేయొచ్చులే అన్న ఆలోచనలో ఉన్నారు. తెలంగాణలోనూ కేసీఆర్ ఓడిన వెంటనే అసెంబ్లీకి రాలేదు. అయితే ఆయన కాలికి గాయం కావడంతో రాలేకపోయారు. కాలు గాయం తగ్గిన తర్వాత కూడా ఆయన అసెంబ్లీకి ఇంతవరకూ రాలేదు. స్పీకర్ వద్దకు నేరుగా వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చారు. వివిధ సమస్యలపై ఆయన జనంలోకి వెళ్లారు. ఇప్పుడు జగన్ కూడా ఇదే పంథాలో వెళ్లాలని భావిస్తున్నారు. అసెంబ్లీకి వెళ్లి అవమాన పడేకంటే కొద్దిగా సమయం తీసుకుని వెళ్లడమే ఉత్తమమని జగన్ భావిస్తున్నట్లు తెలియవచ్చింది. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే. మిగిలిన పది మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లాలని చెప్పి తాను మాత్రం దూరంగా ఉంటారంటున్నారు.


Tags:    

Similar News