Ap Assembly : చంద్రబాబు విజనరీ ఉన్న నాయకుడు.. అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఈరోజు శాసనసభలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్న నాయకుడు అన్నారు. విభజన వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరిగిందన్నారు. హైదరాబాద్ ను కోల్పోయామని, 2014లో ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి కోసం పనిచేశారన్నారు. 2014 -2019 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల వరద పారిందన్నారు.
గత ఐదేళ్లుగా...
అయితే గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారన్నారు. అన్నిరంగాలు నష్టాన్ని చవి చూశాయన్నారు. మార్పు కావాలని భావించబట్టే 2024 ఎన్నికల్లో ప్రజలు పెద్దయెత్తున ఓటింగ్ లో పాల్గొన్నారని గవర్నర్ అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 2014లో పోలవరం ప్రాజెక్టు 75 శాతం పూర్తి చేసినట్లు గవర్నర్ తెలిపారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయిందన్నారు.
వైసీపీ నిరసన...
ఉభయ సభలను ఉద్దేశించి, గవర్నర్ శ్రీ ఎస్.అబ్ధుల్ నజీర్ ప్రసంగం ప్రారంభం కాగానే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నినాదాల మధ్యే, ప్రసంగాన్ని గవర్నర్ కొనసాగించారు. ‘రాష్ట్రంలో హత్యా రాజకీయాలు నశించాలి’.. ‘సేవ్ డెమొక్రసీ’.. అంటూ సభలో నినాదాలు వైసీీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేశారు. గందరగోళం మధ్యనే సభలో గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందని, ప్రజలకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని గవర్నర్ తెలిపారు.