Chandrababu : టమోటాకు.. పొటాటోకు తేడా తెలియని అసమర్థుడి పాలనలో ఉన్నాం
హైదరాబాద్ నేడు వెలిగిపోతుంటే.. అమరావతి వెలవెలబోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు
హైదరాబాద్ నేడు వెలిగిపోతుంటే.. అమరావతి వెలవెలబోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తిరువూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జగన్ ముప్ఫయి ఏళ్లు వెనక్కు తీసుకుపోయారన్నారు. నాశనం చేశారన్నారు. ఐదు కోట్ల ప్రజల కోసం రా కదిలిరా అని ఆయన నినదాలు చేశారు. జగన్ ప్రభుత్వాన్ని తరమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒక్కడి వల్ల ఒక రాష్ట్రం, ఒక తరం ఇంతగా నష్టపోయిన సందర్భం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ఒక అసమర్థుడు వస్తే కొంత వరకే నష్టపోతామని, దుర్మార్గుడు అధికారంలోకి వస్తే చాలా నష్టపోతామని చంద్రబాబు అన్నారు. ఈ రాష్ట్రంలో అందరూ బాధితులేనని అన్నారు. కొందరు ఎక్కువ రోజులు జైలుకు పోవచ్చని, ఇంకొందరు తక్కువ రోజులు జైలుకు వెళ్లవచ్చని అందరూ బాధితులేనని ఆయన అన్నారు.
ఒక్క ప్రాజెక్టు కూడా...
ఈ రాక్షస పాలనకు చరమగీతం పాడాలని ఆయన పిలుపు నిచ్చారు. వ్యవసాయ శాఖనే మూసివేశారన్నారు. టమోటాకు, పొటాటోకు తేడా తెలియని ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతికి దుస్థితి రావడానికి కారకులు ఎవరు అని సభకు వచ్చిన ప్రజలను చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగు జాతి గ్లోబల్ గా ఎదిగేందుకు టీడీపీ ఉపయోగపడిందని ఆయన తెలిపారు. జగన్ రెడ్డిది అంతా రివర్స్ పాలన అని ఆయన ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయిన అసమర్థ ముఖ్యమంత్రి అని జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు. చివరకు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే 32 మండాలలకు నీళ్లు వచ్చేవని, కానీ అది పూర్తి చేయలేకపోయారని ఆయన అన్నారు. తిరువూరు, నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట, నూజివీడు ప్రాంతాలకు నీళ్లు వచ్చే పథకాన్ని ఎండబెట్టారని అన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు.
రాజధానిగా అమరావతే...
రైతులు బాగుపడాలంటే టీడీపీ, జనసేన ప్రభుత్వం రావాలని, ఈ సైతాన్ సర్కార్ పోవాలని ఆయన అన్నారు. మూడు రాజధానులను మూడు ముక్కలు చేసి సర్వనాశనం చేశారన్నారు. ఆరోజు సైబరాబాద్ తాను చేయకుంటే ఇప్పుడు హైదరాబాద్ అలా అభివృద్ధి అయ్యేదా? అని ప్రశ్నించారు. మనకు రాజధాని లేకుండా ఐదేళ్ల పాలించాడని అన్నారు. తాము అధికారంలోకి రాగానే దేవతల రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామని చంద్రబాబు తెలిపారు. యువతకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. మహిళలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిత్యావసర వస్తువల ధరలు పెరిగిపోయాయని చెప్పారు. విద్యుత్తు ఛార్జీలను తొమ్మిది సార్లు పెంచి జనాన్ని బాదుతున్నారన్నారు. చివరకు చెత్తపై కూడా పన్ను వేసే హీన స్థితికి ఈ ప్రభుత్వం దిగజారిందని చంద్రబాబు మండిపడ్డారు.