చంద్రబాబు ఆలోచన వేరట.. అందుకే అలా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జైలుకెళ్లి 23 రోజులు అయింది. ఆయన ఎప్పుడు బయటకు వస్తారో తెలియని పరిస్థితి.

Update: 2023-10-01 06:28 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జైలుకెళ్లి 23 రోజులు అయింది. ఆయన ఎప్పుడు బయటకు వస్తారో తెలియని పరిస్థితి. న్యాయస్థానాల్లోనూ చంద్రబాబు వేసిన పిటీషన్ల విచారణ వాయిదా పడుతుండటం, కొన్నింటిని కొట్టి వేయడంతో ఇంకెన్ని రోజులు చంద్రబాబు జైలులో ఉంటారన్న ప్రశ్న క్యాడర్ ను వేధిస్తుంది. నలభై పదుల రాజకీయ అనుభం కలిగిన చంద్రబాబు జైలు జీవితం గడుపుతారని కింది స్థాయి కార్యకర్త ఊహించి ఉండరు. అలాంటిది ఈరోజు.. రేపు అంటూ దాదాపు ఇరవై మూడు రోజుల నుంచి జైలులోనే ఉండటంతో పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజమండ్రి జైలులో...
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో గత నెల 8వ తేదీన సీఐడీ అధికారులు చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేశారు. 9వ తేదీన ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. పదో తేదీ నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో 7691 నెంబరు రిమాండ్ ఖైదీగానే ఉంటున్నారు. ఇంటి నుంచి భోజనం, మందులకు న్యాయస్థానం అనుమతివ్వడం కొంత ఊరట కలిగించినా వెంటనే బెయిల్ పై తమ పార్టీ అధినేత చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారని కార్యకర్తలు భావించారు. కానీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. న్యాయస్థానాల్లోనూ చంద్రబాబుకు అనుకూలంగా తీర్పులు రాకపోవడంతో 23 రోజుల నుంచి జైలులోనే ఉండాల్సి వచ్చింది.
బెయిల్ కాకుండా...
క్వాష్ పిటీషన్ కంటే బెయిల్ పిటీషన్ వేయాలి కదా? అని సామాన్య కార్యకర్త నుంచి వస్తున్న ప్రశ్న. కానీ చంద్రబాబు ఆలోచన వేరు. క్వాష్ పిటీషన్ ను అనుమతించి తనపై నమోదయిన ఎఫ్ఐఆర్ ను సుప్రీంకోర్టు కొట్టివేస్తే కడిగిన ముత్యంలా బయటకు రావచ్చన్నది ఆయన భావన. అందుకే సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్ కంటే క్వాష్ పిటీషన్ వేయాలని న్యాయవాదులకు సూచించారని నేతలు చెబుతున్నారు. అక్టోబరు 3వ తేదీన క్వాష్ పిటీషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. మరి ఆరోజైనా తమ అధినేతకు న్యాయం జరగాలని కోరుకుంటూ ఆలయాలు, మసీదులు, చర్చిలలో కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు. ఎల్లుండికి దీనిపై క్లారిటీ రానుంది.


Tags:    

Similar News