TDP : మూడో విడత జాబితా ఎన్నాళ్లు?
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటి పోతుంది. త్వరలో ఏడాది పాలన పూర్తి కావస్తుంది;

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటి పోతుంది. త్వరలో ఏడాది పాలన పూర్తి కావస్తుంది. అయినా ఇప్పటి వరకూ నామినేటెడ్ పోస్టుల భర్తీ కొంత వరకే జరిగింది. రెండు విడతలుగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసినా కూటమిలోని జనసేన, బీజేపీతో పాటు తమ పార్టీ నేతలకు పంచాల్సి రావడంతో అందరికీ అవకాశం ఇవ్వలేకపోయారు. ఇప్పుడు మూడో దఫా జాబితాను విడుదల చేస్తామని సిద్ధంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఉగాది నాటికి మూడో విడత నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారని అందరూ భావించారు. కానీ ఉగాది వెళ్లి పోయినా నామినేషన్ పోస్టుల ఊసే లేకపోవడంతో తెలుగు తమ్ముళ్లలో నిరాశ కనపడుతుంది.
మహానాడు లోపు...
వచ్చే మహానాడుకు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉన్నారు. మహానాడుకు ఇంకా రెండు నెలలకు పైగానే సమయం ఉంది. గత ఏడాది సెప్టంబరులో తొలి జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. మొత్తం ఇరవై కార్పొరేషన్లను నాడు భర్తీ చేశారు. దాదాపు తొంభయి తొమ్మిది మందికి పదవులు లభించాయి. రెండో విడత నామినేటెడ్ పోస్టులను గత ఏడాది నవంబరులో భర్తీ చేశారు. 59 మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. గత ఎన్నికల్లో సీట్లను త్యాగం చేసిన వారితో పాటు పార్టీ కోసం శ్రమించిన వారికి పదవులను ఇస్తామని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటానని, వారి నుంచి పూర్తి స్థాయిలో పేర్లు అందలేదని కూడా చంద్రబాబు చెప్పారు.
మూడో విడతగా...
తాజాగా మూడో విడతగా ఏఎంసీ ఛైర్మన్ లతో పాటు మార్కెట్ కమిటీలతో పాటు దేవాదాయాలకు చెందిన కమిటీలను కూడా భర్తీ చేస్తామని చంద్రబాబు చెప్పారు. దీనిపై తమ్ముళ్లు ఆశలు పెట్టుకున్నారు. ఏడాది చూస్తుండగానే గడచిపోయిందని, ఇప్పటి వరకూ తమకు గుర్తింపు లభించలేదని వారు అంటున్నారు. కొన్ని రోజులుగా చంద్రబాబు నియోజకవర్గాల నుంచి నివేదికలను తెప్పించుకుని ఆయన కసరత్తు చేస్తున్నారు. మూడో విడత కూడా పూర్తిగా భర్తీ చేసే అవకాశం కనిపించడం లేదు. కొన్ని ఖాళీలుగా ఉంచి అసంతృప్త నేతలకు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. నామినేటెడ్ పోస్టులకు అరవై వేల పైచిలుకు దరఖాస్తులు రావడంతో వాటిని వడపోత పట్టేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారు.
సుదీర్ఘ కసరత్తు...
చిన్నదైనా, పెద్దదైనా నామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేస్తే దాని బాధ్యతలను చేపట్టాలని చంద్రబాబు ముందుగానే నేతలకు సంకేతాలు పంపారు. టిక్కెట్లు కోల్పోయిన వారితో పాటు పార్టీకి కష్టకాలంలో పనిచేసిన వారికి మాత్రమే నామినేటెడ్ పోస్టులను గుర్తించి భర్తీ చేయాలన్న నిర్ణయంతో పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నారు. అయితే ఇందులో కూడా బీజేపీ, జనసేనలకు కొన్ని కేటాయింపులు జరపాల్సి రావడంతో పాటు సామాజికవర్గాల వారీగా నియామకాలు చేపట్ట వలసి ఉండటంతో కసరత్తు సుదీర్ఘంగా సాగుతుంది. ఉగాది నాటికి గుడ్ న్యూస్ అందుతుందని భావించిన తెలుగు తమ్ముళ్లకు భర్తీ చేయకపోవడంతో నిరాశ ఎదురయింది. దీంతో టీడీపీ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎప్పుడు? అన్నది చర్చగా మారింది.