Chandrababu : చంద్రబాబు అసలు ప్లాన్ ఇదేనట.. తెలిస్తే షాకవ్వాల్సిందే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం;

Update: 2025-04-03 06:35 GMT
chandrababu, chief minister, support, central government
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం. అందుకే గతంలో ఎన్డీఏతో విభేదించి అనేక సార్లు బయటకు వచ్చినప్పటికీ ఈ సారి మాత్రం అలాంటి సాహసానికి దిగే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్రం ఎటు చూసినా ఇబ్బందుల్లో ఉంది. ఇటు రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండటం చంద్రబాబు ప్రధాన లక్ష్యం. ఈ రెండు అంశాలు ఒడ్డున పడాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అవసరం. అవసరమైన నిధులతో పాటు రుణాలు కూడా పొందేందుకు కేంద్రం నుంచి సహకారం లభిస్తే తాము అనుకున్న లక్ష్యాన్ని చేరవచ్చన్నది చంద్రబాబు ఆలోచన.

కేంద్రంతో సయోధ్యతతో...
అందుకే కేంద్ర ప్రభుత్వానికి తమతో ఉన్న అవసరాల కంటే తనకు కేంద్రంతో అవసరాలు ఎక్కువని చంద్రబాబు నాయుడుకు తెలియంది కాదు. అందుకే వీలయినంత త్వరగా రాజధాని అమరావతి పనులను ప్రారంభించాలని, అందులోనూ ప్రధాని మోదీ చేత శంకుస్థాపనలు చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు, హడ్కో నుంచి పదకొండు వేల కోట్ల రూపాయల నిధులు దాదాపుగా మంజూరయ్యాయి. వీటితో మొదటి దశ పనులను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది చంద్రబాబు సర్కార్. మూడేళ్లలో మొదటి దశ పనులు పూర్తి చేయగలిగితే ఎనభై శాతం అమరావతి విషయంలో విజయం సాధించినట్లేనని చంద్రబాబు భావిస్తున్నారు.
అమరావతి గాడిలో పెడితే...
ఒకసారి అమరావతి అభివృద్ధి పరంగా ముందుకు వెళితే మిగిలిపోయిన భూములను విక్రయించి రాజధాని అమరావతి కోసం చేసిన రుణాలను సులువుగా తీర్చడమే కాకుండా అధిక ఆదాయాన్ని కూడా పొందవచ్చు. దీని ద్వారా సంపదను పెంచుకోవచ్చని భావిస్తున్నారు. అప్పుడు తాము ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి వీలవుతుంది. అదే చంద్రబాబు అసలు ప్లాన్ గా ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మూడేళ్లలో ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చడమే కాకుండా కూటమికి మరోసారి విజయం దక్కేందుకు బాటలు వేయవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే కేంద్రంతో సయోధ్యతతో మెలుగుతూ, అనుకున్నది రాబట్టుకుంటూ ఈ మూడేళ్ల కాలంలో కొంత అభివృద్ధి, కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలని భావిస్తున్నారు.
పోలవరం పరుగులు పెట్టాలంటే...
మరోవైపు పోలవరం పనులు పరుగులు పెట్టాలన్నా కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయగలిగితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రైతులు కూడా తమ పక్షాన నిలబడతారన్న భావనలో ఉన్నారు. అలాగే ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో బనకచర్ల పథకంపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి ముందుకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన ఈరోజు బనకచర్ల ప్రాజెక్టు పై మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇలా అనేక రకాలుగా చంద్రబాబు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీకి మరోసారి విజయం అందించేందుకు ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారు.


Tags:    

Similar News