Ys Jagan : జగన్ కు ఇక వారే దిక్కట... ఇప్పటికి అర్థమయిందా డ్యూడ్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఇప్పుడు అసలు నాయకులకంటే కొసరు నాయకులే కీలకంగా మారినట్లు కనిపిస్తుంది;

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఇప్పుడు అసలు నాయకులకంటే కొసరు నాయకులే కీలకంగా మారినట్లు కనిపిస్తుంది. పెద్ద పెద్ద నేతలు పార్టీ ఓటమి పాలయిన నాటి నుంచి రోడ్డు మీదకు రావడానికి భయపడుతున్నారు. జగన్ హయాంలో మంత్రి పదవులను పొందిన వారు సయితం పార్టీ ఓడిపోయిన తర్వాత మాత్రం అందుబాటులో లేకుండా పోయారు. గత ఎన్నికల్లోనూ టిక్కెట్లు పొందిన వారిలో కొందరు మాత్రమే యాక్టివ్ గా ఉంటున్నారు. మిగిలిన వారంతా మౌనంగానే ఉంటున్నారు. సీనియర్ నేతలు అని భావించిన వారు సయితం పార్టీ కోసం ముందుకు రాకపోవడంతో వైసీపీ పని ఇక అయిపోయినట్లేనని అందరూ అనుకుంటున్న సమయం వచ్చేసింది.
ద్వితీయ శ్రేణినేతలు, క్యాడర్...
అయితే ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ద్వితీయ శ్రేణి నేతలు బలంగా నిలబడి పదవులను సాధించుకోవడంతో తిరిగి ఫ్యాన్ పార్టీ రైజ్ అవుతుందన్న అంచనాలు వినపడుతున్నాయి. దీంతో పాటు తాము మరోసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ సారి క్యాడర్ కు పూర్తి బాధ్యతలతో పాటు పదవులను కట్టబెడతానని జగన్ ఇస్తున్న హామీలు వర్క్ అవుట్ అవుతున్నట్లే కనపడుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ క్యాడర్ లో కొంత అసంతృప్తి అయితే నెలకొంది. అధికారంలో ఉన్ననాళ్లు తమను పట్టించుకోకపోవడంతో పాటు ఎమ్మెల్యేలు కూడా పవర్ లో ఉన్నప్పుడు క్యాడర్ ను పూర్తిగా విస్మరించడంతో ఐదేళ్ల పాటు జెండా కూడా పట్టుకోలేదు.
వాలంటీర్లకు ప్రాధాన్యత...
ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పడు వాలంటీర్లకే ప్రాధాన్యత ఇచ్చిన జగన్ క్యాడర్ ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వీర్యం చేశారు. పోలింగ్ కేంద్రాలకు తీసుకు వచ్చి పార్టీకి అనుకూలంగా ఓటు వేయించడంలో కీలక పాత్ర పోషించే క్యాడర్ తో జనానికి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అందుకే గత ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద క్యాడర్ నిలబడలేదు. వాలంటీర్లను నమ్ముకున్న జగన్ నిలువునా మునిగిపోయారు. ఓటమి తర్వాత విషయం అర్థం కావడంతో జగన్ నష్ట నివారణ చర్యలుచేపట్టారు. తనకు కార్యకర్తలు ముఖ్యమని చెబుతూ ఈసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వారికి ప్రయారిటీ ఇస్తామని చెబుతూ కొంత వరకూ గాడిలో పెట్టగలిగారు. ప్రస్తుతం నేతలకంటే క్యాడర్ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు.
నేతలు కూడా ...
క్యాడర్ బయటకు వస్తుండటంతో నేతలు కూడా ఇక ఇళ్లు వదిలి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ కూడా త్వరలోనే జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ముఖ్యమైన కార్యకర్తలతో సమావేశం జరిపి వారి ఫీడ్ బ్యాక్ మేరకు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను తిరిగి తీసుకు వచ్చినా కార్యకర్తల విషయంలో మాత్రం ఈసారి నిర్లక్ష్యం చేయకూడదని నిర్ణయించుకున్నారు. క్యాడర్ ఎంత అవసరమో ఇప్పుడు జగన్ కు తెలిసి వచ్చింది. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కనపడని క్యాడర్ దిగిన తర్వాత మాత్రం వారే దిక్కయినట్లు కనిపిస్తుంది.