బీజేపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చేసిన పవన్
ఏపీ ప్రభుత్వం ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొని ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ అన్నారు
ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొని ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ అన్నారు. ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. జనవాణి కార్యక్రమంలో ఎన్నో సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా సరిగా జీతాలు రావడం లేదన్నారు. తమ పార్టీ పొత్తుల గురించి వైసీపీ పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాలని హితవు పలికారు. తాము ఎవరితో పొత్తు పెట్టుకుంటామో? ఎన్ని సీట్లలో పోటీ చేస్తామనేది వైసీపీకి అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
తాను ఇంతకుముందే...
ప్రస్తుతం ఎన్డీఏలోనే జనసేన ఉందని పవన్ అన్నారు. తాను ఢిల్లీ వెళ్లినప్పుడల్లా 2014 లో ఏపీలో ఉన్న పొత్తులతోనే వెళ్దామని అక్కడి నేతలకు చెప్పానని తెలిపారు. జేపీ నడ్డాకు కూడా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పానని తెలిపారు. జీ 20 సమ్మిట్ జరుగుతున్నప్పుడు కేంద్రానికి తెలియకుండా చంద్రబాబుపై కేసులు బనాయించి జైలుకు పంపడం బాధాకరమని పవన్ అన్నారు. జైలులో చంద్రబాబును పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత టీడీపీకి మద్దతు తెలిపానని చెప్పారు. ఎన్డీఏలో ఉన్నా తమ పార్టీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని అన్నారు. జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ ఉండాలని కూడా నిర్ణయించామని తెలిపారు.
కలసి వస్తుందనే...
బీజేపీ తమ కూటమితో కలసి వస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఐదుగురు సభ్యులతో జనసేన కమిటీని నియమించామని తెలిపారు. ప్రజలే తనకు మొదటి ఛాయిస్ అని, ఏపీ రాష్ట్ర అభివృద్ధి తనకు ముఖ్యమని పవన్ కల్యాణ్ తెలిపారు. తెలంగాణకు ఇచ్చిన వరాలు ఏపీకి ఎందుకు ఇవ్వడం లేదని ఢిల్లీకి వెళ్లి జగన్ అడగాలని పవన్ అభిప్రాయపడ్డారు. అంతేకాని తనపై ఉన్న కేసుల గురించి కాదని అన్నారు. ప్రజామోదయోగ్యమైన పనులనే జనసేన చేస్తుందన్నారు. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్న పవన్ కల్యాణ్ వైసీపీని ప్రజలు చీత్కరించుకుంటున్నారని తెలిపారు.