Pawan Kalyan : జగన్ నాకు శత్రువు కాదు.. కక్షసాధింపు చర్యలుండవ్
ఇది కక్ష సాధించే సమయం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
ఇది కక్ష సాధించే సమయం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే పనిచేయాలన్నారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన మాటను తాము నిలబెట్టుకుంటామని తెలిపారు. జగన్, వైసీపీ తనకు శత్రువులు కారని అన్నారు. ఇది ఎంతో చారిత్రాత్మకమైన రోజు అని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విజయంతో భవిష్యత్ లో వైసీపీని ఇబ్బంది పెట్టబోమని పవన్ కల్యాణ్ అన్నారు. ఈరోజు ఏం మాట్లాడారో తనకు తెలియడం లేదన్నారు. 21 స్థానాలు తీసుకుని 21 స్థానాలు గెలిచేంత వరకూ తనకు తెలియదని అన్నారు. హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేటు ఉందని అన్నారు. ఇది జనసైనికులు, వీరమహిళల విజయమని అన్నారు.
పాలన మారాలని...
మార్పు కావాలని, పాలన మారాలని బలంగా కోట్లాది మంది ప్రజలు కోరుకున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇకపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. కక్ష సాధింపులకు సమస్యకాదని అన్నారు. ఏపీకి బలమైన పునాది వేసే సమయం అని అన్నారు. అన్నం పెట్టే రైతుకు అండగా ఉండే సమయమన్నారు. రక్షణ లేని ఆడబిడ్డలకు రక్షణకల్పించే సమయం ఇది అని, ఏపీకి చీకటి రోజులు ముగిశాయి అని అన్నారు. ఏరుదాటాక తెప్ప తగిలేసే రకం కాదని, సీపీఎస్ కు సరిసమానంగా ఏడాదిలో ప్రభుత్వోద్యోగులకు తీసుకువస్తామని చెప్పారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే బాధ్యతను తీసుకుంటామని చెప్పారు.
శాంతిభద్రతలను...
గెలిచింది 21 స్థానాలయినా 175 సీట్లు గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యతతో పనిచేస్తామని తెలిపారు. మధ్యతరగతి ప్రజలు నలిగిపోయారన్నారు. అరాచకం చేశారని, శాంతిభద్రతలను కాపాడతామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. అధికార వ్యవస్థలో రాజకీయ ప్రమేయం తక్కువ ఉండేలా చూస్తామన్నారు. గెలుపు తనకు బాధ్యత ఇచ్చింది కాని, అహంకారం ఇవ్వలేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఇల్లు అలకగానే పండగ కాదని అన్నారు. చాలా బాధ్యతలున్నాయని తెలిపారు. తాను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కూడా బాధపడలేదని, అలాగే ఇప్పుడు గెలిచినప్పుడు ఎగిరి గంతేయనని కూడా ఆయన చెప్పారు. తనకు రాజకీయాల నుంచి డబ్బు అవసరం లేదని ఆయన తెలిపారు. పిఠాపురం ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.