ఈ నియంతను గద్దె దించాల్సిందే
ఈ నియంతను గద్దె దించాలంటే అందరూ నిజాయితీగా నిలబడాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఈ నియంతను గద్దె దించాలంటే అందరూ నిజాయితీగా నిలబడాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. రణస్థలిలో జరిగిన యువశక్తి సభలో ఆయన ప్రసంగించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక న్యాయవాదిని నియమిస్తామని, ఉత్తరాంధ్రలో ప్రతి 34 నియోజకవర్గాలకు ఒక న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. పవన్ కల్యాణ్ నిజయితీ కలిగిన నాయకుడని, ఆయనకు అండగా నిలబడాలని కోరారు. యువత భవిష్యత్ మెరుగుపడాలంటే జనసేనతోనే సాధ్యమని ఆయన అన్నారు.
యువత కోసమే...
జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతకు ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తామో చెబుతామని తెలిపారు. యువత భవిత కోసం తీర్మానం చేస్తామన్నారు. కష్టపడి చదివిన యువతకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. తమ కాళ్లమీద తాము నిలబడుతూ నలుగురికి ఉపాధి కల్పించే విధానం ప్రస్తుత ప్రభుత్వంలో లోపించిందన్నారు. ఉపాధి అవకాశాల కోసం దూర ప్రాంతాలకు వలస వెళుతున్నారన్నారు. ఉత్తరాంధ్ర యువత ఆర్మీరంగంలో ఎక్కువగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రణాళికబద్ధమైన కొత్త యువజన విధానాన్ని తీసుకొస్తామని తీర్మానం ప్రవేశపెడుతున్నామన్నారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకు భరోసా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఉత్తరాంధ్ర డెవలెప్‌మెంట్ అధారిటీని ఏర్పాటు చేస్తామని తీర్మానం చేశారు.